రూ.182 కోట్ల ‘జిహాదీ డ్రగ్’ సీజ్.. దేశంలో క్యాప్టాగన్ ముఠా గుట్టురట్టు

రూ.182 కోట్ల ‘జిహాదీ డ్రగ్’ సీజ్.. దేశంలో క్యాప్టాగన్ ముఠా గుట్టురట్టు

ఢిల్లీలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్ సీబీ) 227 కిలోల ‘క్యాప్టాగన్’ డ్రగ్స్​ను స్వాధీనం చేసుకుంది. పశ్చిమాసియా దేశాల్లో దీన్ని ఎక్కువగా వాడుతారు. దీని విలువ రూ.182 కోట్లుగా అంచనా వేశారు. మిలిటెంట్లు భయం, అలసటకు లోనుకాకుండా దీన్ని వాడుతారు.


న్యూఢిల్లీ: దేశంలోనే మొదటిసారిగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్ సీబీ) భారీ ఎత్తున 'క్యాప్టాగన్' డ్రగ్స్​ను స్వాధీనం చేసుకుంది. పశ్చిమాసియా దేశాల్లో ఎక్కువగా వాడే ఈ డ్రగ్‌‌ను 227 కిలోలకు పైగా సీజ్ చేసింది. దీని విలువ రూ.182 కోట్లుగా అంచనా వేశారు. 'ఆపరేషన్ రేజ్‌‌పిల్' పేరుతో జరిపిన దాడి వివరాలను ఎన్సీబీ శనివారం వెల్లడించింది. 

భారత్ మీదుగా క్యాప్టాగన్ రవాణా అవుతోందంటూ వచ్చిన సమాచారంతో మే 11న ఎన్సీబీ న్యూఢిల్లీ నెబ్ సరాయ్​లోని ఓ నివాస గృహంపై దాడులు నిర్వహించింది. అక్కడ కమర్షియల్ చపాతీ కటింగ్ మిషన్‌‌లో దాచిన 31.5 కిలోల క్యాప్టాగన్ టాబ్లెట్లను స్వాధీనం చేసుకుంది. ఘటనకు సంబంధించి ఓ సిరియా పౌరుడిని అరెస్ట్ చేశారు. మే 14న గుజరాత్‌‌ ముంద్రాలోని కంటైనర్ ఫెసిలిటేషన్ స్టేషన్‌‌పై ఎన్‌‌సీబీ బృందాలు దాడులు చేశాయి. 

అందులో ఉన్న గొర్రెల ఉన్ని మధ్యలో దాచిన 196.2 కిలోల క్యాప్టాగన్ పౌడర్​ను గుర్తించారు. కాగా, ఫెంటాలిన్, ఆంఫెటమిన్ కలయికతో తయారయ్యే క్యాప్టాగన్‌‌ 2011లో సిరియా అంతర్యుద్ధం సమయంలో ఈ డ్రగ్ వెలుగులోకి వచ్చింది. యుద్ధంలో పాల్గొనే మిలిటెంట్లు భయం, అలసటను మరచిపోవడానికి దీనిని వాడడంతో దీనికి 'జిహాదీ డ్రగ్' అనే పేరు వచ్చింది.