రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీతో ఎకానమీకి బూస్ట్

రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీతో ఎకానమీకి బూస్ట్

సంక్షోభం వల్ల ప్రజలకు ముఖ్యంగా పేద వర్గాల వారికి కలిగే నష్టాన్ని తగ్గించడం, ప్రతికూల పరిస్థితులను ఒక అవకాశంగా మార్చుకోవడం.. ఈ రెండే కేంద్ర ప్రభుత్వ ఎకనమిక్​ స్టిమ్యూలస్​ ప్యాకేజీలో కీలకంగా మారాయి. కరోనా వల్ల ఎకానమీపై అనూహ్య ప్రభావం పడింది. ఈ పరిస్థితుల్లో వ్యవస్థలో కింద ఉన్న వారికి కొంత ఊరట కలిగించడం ఒక ఎత్తయితే, ఎకానమీకి మళ్లీ ఊపు తేవడం మరో ఎత్తు. మాన్యుఫ్యాక్చరింగ్​ సామర్థ్యంపై పడ్డ ఎఫెక్ట్​ను సరిచేసి మళ్లీ దారిలో పెట్టడానికి, సాహసోపేతంగా తీసుకొచ్చిన సంస్కరణలు ఆర్థిక వ్యవస్థ సత్తాను పెంచడానికి తోడ్పడతాయి. సెంట్రల్​ ఫైనాన్స్​ మినిస్టర్​ నిర్మలా సీతారామన్​ గడిచిన ఐదు రోజులుగా ప్రకటించిన ఎకనమిక్​ స్టిమ్యూలస్​ ప్యాకేజీ చాలా జాగ్రత్తగా రూపొందింది. బ్యాలెన్స్​ పాటిస్తూ రూపొందించిన ఈ ప్యాకేజీ రాబోయే రోజుల్లో లక్ష్యాలను సాధిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

డిమాండ్, సప్లైపై ప్రభావం

90ల చివర్లో ఆసియాలో వచ్చిన ఆర్థిక సంక్షోభం, 2008–09 నాటి వరల్డ్​ ఎకనమిక్​ క్రైసిస్ కంటే ఈ సంక్షోభం ఘోరంగా ఉందని గుర్తించారు. ఇది ఎకానమీలో సప్లై, డిమాండ్‌ను తీవ్రంగా ప్రభావితం చేసింది. ప్రభుత్వ చర్యలు ఈ రెండింటిని చక్కగా పరిష్కరిస్తాయి. సప్లై వైపు, సర్కారు రెస్పాన్స్​ 4 రెట్లు పెరిగింది. మొదట ఆహార భద్రత కల్పించడంతో పాటు రైతుల ఆదాయం తగ్గకుండా చూసుకోవాలి. లాక్ డౌన్ ప్రకటించగానే ప్రభుత్వం వ్యవసాయం, సంబంధిత కార్యకలాపాలను అత్యవసర సేవలుగా ప్రకటించింది. దీంతో రబీ పంటను సేకరించడానికి దారి దొరికింది. రైతుల చేతుల్లో కొత్త కొనుగోలు శక్తిగా రూ.78,000 కోట్లు అందుబాటులోకి తేవడానికి ఇది ఉపయోగపడింది.

ఎంఎస్ఎంఈలకు హామీ లేని లోన్లు

ఇక రెండోది.. క్యాష్/లిక్విడిటీ కొరత దివాలాకు దారి తీయకుండా అడ్డుకోవడం. కమర్షియల్​ బ్యాంకుల లోన్​ సర్వీసింగ్ బాధ్యతలపై టెంపరరీ మారటోరియం ప్రకటించడం. ఎంఎస్ఎంఈలకు ఇది బాగా ఉపయోగపడుతుంది. వీరి కోసం ఎలాంటి హామీ లేకుండా రూ.3 లక్షల కోట్ల అదనపు లోన్​ సౌకర్యం కల్పించారు. ఎంఎస్ఎంఈలు రూ.50,000 కోట్ల ఫండ్ ఆఫ్ ఫండ్స్ నుండి కొత్త ఈక్విటీని పొందవచ్చు. ఫైనాన్స్​ మినిస్టర్​ ప్రకటించిన ఈ చర్యలు టూరిజం, ఎంటర్​టైన్​మెంట్, రిటైల్ వంటి సెక్టార్లకు సహాయపడతాయి. రాష్ట్ర డిస్కమ్​లకు రూ.90,000 కోట్ల క్రెడిట్ ప్యాకేజీ బెనిఫిట్స్​ చేకూర్చే లిస్ట్​లో ఉంది. ఎందుకంటే ఇది రాష్ట్ర విద్యుత్​ యుటిలిటీలు, విద్యుత్ ఉత్పత్తిదారులను దివాలా తీయకుండా కాపాడుతుంది. లేకపోతే ఇది ఘోరమైన ఫలితాలను కలిగించేది.

డిమాండ్ పెరుగుతుంది

మాన్యుఫ్యాక్చరింగ్​ సెక్టార్​లో వస్తువుల డిమాండ్, వాడకం, ఇన్వెస్ట్​మెంట్​ గురించి కూడా కేంద్రం దృష్టి పెట్టడం ముఖ్యం. కస్టమర్ల చేతిలో ఉన్న క్యాష్​ ను మాత్రమే ఎకానమీలో తగ్గుతున్న డిమాండ్‌‌ను పెంచడానికి ఏకైక మార్గంగా భావించేవారు దీనిని గమనించాలి. ఎంఎస్ఎంఈలకు కానీ, వ్యాపారులకు కానీ, రైతులకు కానీ అందించిన అదనపు రుణ సౌకర్యాలు(కేసీసీ కింద ఇప్పటికే పరిమితులను దాటి రూ.2 లక్షల కోట్లను అందించడం జరిగింది) డిమాండ్​ను పెంచడానికి ఉపయోగపడతాయి.

వివిధ వర్గాలకు నేరుగా ప్రయోజనం

కన్జంప్షన్ డిమాండ్‌‌ను నేరుగా పెంచడానికి ఎన్నో చర్యలు ప్రకటించారు. 20 కోట్ల మంది మహిళల జన్​ ధన్ అకౌంట్లు, అతి తక్కువ ఆదాయం ఉన్నవారు, పేదలు, వలస కూలీల సంక్షేమానికి (మొదటి ప్యాకేజీలో ప్రకటించిన) రూ.1.73 లక్షల కోట్లు ప్రకటించారు. టీడీఎస్, టీసీఎస్ 25% కోతకు గురైన వారికి చేతికి అదనపు ఆదాయం వస్తుంది. మెట్రోలు, సిటీల నుంచి సొంతూర్లకు తిరిగి వెళ్లే వారి కోసం ఉపాధి హామీ కింద రూ.40, 000 కోట్ల అదనపు కేటాయింపులు చేశారు. కనస్ట్రక్షన్​ కార్మికులకు రూ.30,000 కోట్లు, 12 కోట్ల మంది రైతులకు రూ.17,800 కోట్లు బదిలీ చేశారు. వలస కూలీల కోసం క్వారంటైన్ సెంటర్లు నడుపుతున్న వారి ఖర్చుల కోసం రూ.13,000 కోట్లు రాష్ట్రాలకు బదిలీ అయ్యాయి. ఈ చర్యలు వివిధ వర్గాల వారికి నేరుగా ప్రయోజనం చేకూర్చేవే. ఇవి తప్పకుండా ఎకానమీ వేగవంతంగా కోలుకోడానికి ఉపయోగపడే లోకల్​ డిమాండ్ ను పెంచుతాయి.

మోడీ చెప్పిన దానికంటే ఎక్కువే

ఫైనాన్స్​ మినిస్టర్​ నిర్మలా సీతారామన్​ ప్రకటించిన స్టిమ్యూలస్​ ప్యాకేజీ పరిమాణం రూ.20.97 లక్షల కోట్లు. మే 12న ప్రధాని మోడీ చెప్పిన ప్యాకేజీ మొత్తానికంటే ఇది ఎక్కువ. ఇది జీడీపీలో 10% కంటే ఎక్కువ. ఇతర డెవలపింగ్​ కంట్రీస్​ ప్రకటించిన ప్యాకేజీల మాదిరిగానే ఇది చాలా సానుకూలంగా ఉంటుంది. గ్లోబల్​ స్టాండర్డ్స్, ఇంటర్నేషనల్​ కాంపిటీషన్​ ను తట్టుకుని ఇండియన్​ కంపెనీలు నిలబడేలా సామర్థ్యాన్ని కల్పించడానికి ఈ రిఫార్మ్స్​ ఎంతో ఉపయోగపడతాయి. ఈ చర్యలు ఇబ్బందుల్లో ఉన్న మన రైతులకు అవసరమైన స్వేచ్ఛ, ఆర్థిక బలాన్ని ఇస్తాయి. ఈ ప్యాకేజీ కరోనా తర్వాత కాలంలో ఎకానమీ కోలుకోవడానికి తగిన ప్రోత్సాహాన్ని, భరోసాని ఇస్తుంది.

డిఫెన్స్​ సెక్టార్​కు బూస్ట్

అగ్రికల్చర్, మాన్యుఫ్యాక్చరింగ్​ సెక్టార్లలో ప్రైవేటు పెట్టుబడులు పెంచడానికి మూడోది ఉపయోగపడుతుంది. పెండింగ్‌‌లో ఉన్న రిఫార్మ్స్​ అందుబాటులోకి రావడంతో రైతులు తమకు నచ్చిన క్లయింట్స్​ను ఎంచుకోవటానికి స్వేచ్ఛ వచ్చింది. లిబరలైజేషన్​ చర్యల వల్ల డిఫెన్స్ ప్రొడక్ట్స్, ఎక్స్​పోర్ట్స్​ కు బూస్ట్​ ఇచ్చినట్లయింది. ప్రైవేట్ ఇన్వెస్ట్​మెంట్లను పెంచడం వల్ల పబ్లిక్​ సెక్టార్​ కంపెనీల పరిస్థితి మెరుగవుతుంది. చివరగా, ఆర్థిక వనరులు లేని 50 లక్షలకుపైగా కుటుంబాలు, స్ట్రీట్​ వెండార్లకు కేపిటల్​ ఇన్వెస్ట్​మెంట్​గా రూ.10,000 లోన్​ సౌకర్యం కల్పించడం వల్ల వారి ఉపాధికి ఓ దారి చూపెట్టినట్టయింది. ఈ ప్యాకేజీ ప్రస్తుతం ఉన్న మాన్యుఫ్యాక్చరింగ్​ సామర్థ్యాలకు భరోసా ఇవ్వడమే కాకుండా దేశ, విదేశీ పెట్టుబడులు పెరిగి ప్రైవేట్ సెక్టార్​ను మరింత బలం చేకూరుస్తుంది.

రాజీవ్ కుమార్,
నీతి ఆయోగ్ వైస్ చైర్మన్