ఆర్టీసీ బస్సుల్లో 30% పెరిగిన ఓఆర్..పల్లె వెలుగు మొదలు.. సిటీ బస్సులదాకా కిక్కిరిసిపోతున్న జనం

ఆర్టీసీ బస్సుల్లో 30% పెరిగిన ఓఆర్..పల్లె వెలుగు మొదలు.. సిటీ బస్సులదాకా కిక్కిరిసిపోతున్న జనం

హైదరాబాద్, వెలుగు: పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగడంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారి సంఖ్య పెరుగుతోంది. ఈ నెల రెండో వారం  నుంచి బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో(ఓఆర్) 30శాతం మేర పెరిగిందని అధికారులు చెప్తున్నారు. సాధారణంగా ప్రధాన రూట్లలో నడిచే ఆర్టీసీ బస్సుల్లో 80 నుంచి 85 శాతం ఆక్యుపెన్సీ  ఉంటుంది. కానీ, పది రోజులుగా100 శాతం దాటిందని వివరిస్తున్నారు. పెట్రోల్, డీజిల్ కొరత తప్పదనే ప్రచారం కారణంగా ప్రజా రవాణా వ్యవస్థ వైపు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. పల్లె వెలుగుతో పాటు గ్రేటర్ సిటీ బస్సుల్లోనూ ఈ రద్దీ స్పష్టంగా కనిపిస్తోంది. ఆయా బస్సుల్లో జనం నిల్చోవడానికి కూడా స్థలం ఉండట్లేదని ఆర్టీసీ అధికారులు అంటున్నారు.

అంతర్రాష్ట్ర బస్సుల్లోనూ పెరిగిన డిమాండ్

అంతర్రాష్ట్ర సర్వీసుల్లో ఆక్యుపెన్సీ చాలావరకు పెరిగిందని ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. గుంటూరు, విజయవాడ, తెనాలి, ఒంగోలు, మచిలీపట్నం, నెల్లూరు, పుట్టపర్తి, శ్రీశైలం, తిరుపతి, బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు హైదరాబాద్ నుంచి వెళ్లే ఏసీ బస్సుల్లో కూడా ఓఆర్​ 30 నుంచి 35 శాతం వరకు పెరిగిందని వివరిస్తున్నారు. ఈ బస్సుల్లో రిజర్వేషన్లు చేయించుకునే వారి సంఖ్య గతంతో పోల్చితే ఈసారి 30 శాతానికి పైగా పెరిగిందని, చాలా మందిని వెయిటింగ్ లిస్టులో పెట్టే పరిస్థితి ఉందంటున్నారు. ఇది ప్రజా రవాణా వ్యవస్థపై ముఖ్యంగా ఆర్టీసీ సంస్థపై ప్రజలకు పెరిగిన నమ్మకానికి నిదర్శనమని అధికారులు చెప్తున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదాలు కూడా ఈ తరహా ప్రయాణికుల సంఖ్య పెరగడానికి మరో కారణం అని వివరిస్తున్నారు. ఇప్పుడు వేసవి సెలవులు కావడంతో జనం రద్దీ సహజంగానే పెరుగుతుందని, ఇది జూన్ 10 నుంచి 15 వరకు కొనసాగుతుందని అంటున్నారు. ఏదేమైనా, ఈసారి గతానికి మించి ఓఆర్​ 
నమోదవుతోందని చెప్తున్నారు.