ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొనసాగుతున్న బంద్

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొనసాగుతున్న బంద్

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బంద్ కొనసాగుతోంది. ఆర్టీసీ కార్మికుడు శ్రీనివాస్ రెడ్డికి మృతికి సంతాపంగా అఖిలపక్షం ఆధ్వర్యంలో జిల్లాలో బంద్ పాటిస్తున్నారు. దీంతో జిల్లాలోని 6 డిపోల నుంచి బస్సులను బయటకు రాకుండా అడ్డుకున్నారు కార్మికులు. డిపోల ముందు తెల్లవారుజాము నుంచే బైఠాయించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని డిపోల ముందు కార్మికులు ఆందోళనలు చేపట్టారు. ఆర్టీసీ కార్మికులు శ్రీనివాస్ రెడ్డి, సురేందర్ గౌడ్ మృతికి సంతాపంగా నిరసనలు తెలిపారు. కొత్తగూడెం డిపో ముందు నల్ల బ్యాడ్జీలు ధరించి యోగాసనాలు వేశారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్మికుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.  ఆర్టీసీని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఇప్పటికైనా  కేసీఆర్ చర్చలు జరపాలని కోరారు.  కార్మికులు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దంటూ పిలుపునిచ్చారు.

ప్రతిపక్ష పార్టీలు, పలు సంఘాల నేతలు ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.  ఉద్యోగులు, రాజకీయ పార్టీలు,ప్రజా సంఘాలు, విద్యార్థి, యువజన,కార్మిక సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు ఈ బంద్ కు మద్ధతు తెలుపుతున్నాయి.

RTC driver suicide: bandh in Joint Khammam district