న్యూఢిల్లీ: నీట్ యూజీ క్వశ్చన్ పేపర్ లీక్, పరీక్ష రద్దుపై కాంగ్రెస్ అగ్ర నాయకుడు, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నీట్ పరీక్ష కోసం 22 లక్షల మంది విద్యార్థులు రెండేళ్లపాటు రాత్రింబవళ్లు కష్టపడ్డారని, కానీ పేపర్ లీక్‌తో వారి కష్టమంతా వృధా అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పేపర్ లీక్, పరీక్ష రద్దుతో 22 లక్షల మంది విద్యార్థులు మోసపోయిన ఈ ఘటనపై ప్రధాని మోడీ మౌనం వహిస్తున్నారని మండిపడ్డారు.
పరీక్షకు రెండు రోజుల ముందు నీట్ పేపర్ వాట్సాప్‌లో లీక్ చేశారన్న విషయం దేశమంతటికీ తెలుసు. కానీ దీనికి బాధ్యత తీసుకోవడానికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాత్రం నిరాకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మేంద్ర ప్రధాన్‌ను తక్షణమే పదవి నుంచి భర్తరఫ్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ, విశ్వవిద్యాలయ అధికారుల మధ్య ఉన్న లోపాయికారీ ఒప్పందం దేశ విద్యా వ్యవస్థను దెబ్బతీసిందని ఆరోపించారు.
దేశంలో వైస్ ఛాన్సలర్ల నియామకాలు అర్హత, అనుభవం ఆధారంగా కాకుండా సైద్ధాంతిక అనుబంధం ఆధారంగా జరుగుతున్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నవారు ఈజీగా వైస్ ఛాన్సలర్ అయిపోవచ్చన్నారు. మోడీ సర్కార్ హయాంలో దేశంలో 80 సార్లు పేపర్ లీక్‌లు జరిగాయని ఫలితంగా రెండు కోట్ల మంది యువత భవిష్యత్తును నాశనం అయిందని అన్నారు. పత్రాల లీకేజీకి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
