ఈవీఎం స్ట్రాంగ్ రూమ్‌కు షిఫ్ట్‌ల వారీగా సమాజ్‌వాదీ నేతల కాపలా

ఈవీఎం స్ట్రాంగ్ రూమ్‌కు షిఫ్ట్‌ల వారీగా సమాజ్‌వాదీ నేతల కాపలా

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిన్నటితో ముగిసింది. మొత్తం 403 అసెంబ్లీ స్థానాల్లో ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు మొత్తం ఏడు దశల్లో ఓటింగ్ జరిగింది. సమాజ్ వాదీ, బీజేపీల మధ్య నువ్వా నేనా అన్నట్టు జరిగిన ఎన్నికల్లో..  ఓటర్లు తమ చాయిస్ ఎవరన్న తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేసేశారు. ఓ వైపు 
ఇప్పటికే వెలువడిన ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాల్లో మాత్రం మళ్లీ బీజేపీ ప్రభుత్వమే రాబోతోందని తేలింది. అయితే అసలు ప్రజల తీర్పు ఏంటన్నది తేల్చడానికి ఇక మిగిలింది కౌటింగ్ చేసి.. ఎవరు గెలిచారన్నది ప్రకటించడమే. మార్చి 10న ఈ ప్రక్రియ సాగబోతోంది. అప్పటి వరకు ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్స్ లో భద్రంగా ఉంటాయి. వీటికి అనుక్షణం పోలీసులు, పారా మిలిటరీ సెక్యూరిటీ ఉంటుంది. అయినా మీరట్ జిల్లా హస్తినాపూర్ లో సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి స్వయంగా తానే స్ట్రాంగ్ రూమ్ కు కాపు కాస్తున్నాడు. అదేమంటే తమకు బీజేపీ ప్రభుత్వంపై, ఎగ్జిట్ పోల్స్ పై నమ్మకం లేదని అంటున్నారాయన.

షిఫ్టుల వారీగా కాపలా..

మీరట్ జిల్లా హస్తినాపూర్ నియోజకవర్గం నుంచి సమాజ్ వాదీ పార్టీ తరఫున యోగేశ్ వర్మ బరిలో ఉన్నారు. ఆయన ఇవాళ ఉదయం ఈవీఎంలను భద్రపరిచిన బిల్డింగ్ బయట తన కారు ఎక్కి బైనాక్యూలర్ తో అదే పనిగా స్ట్రాంగ్ రూమ్స్ ను పరిశీలిస్తూ కనిపించారు. దీంతో మీడియా ప్రతినిధులను ఆయనను ప్రశ్నించగా.. బీజేపీ ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదని ఈవీఎంలను ఏమైనా తారుమారు చేస్తారేమోనన్న భయంతో నిఘా పెట్టామని చెప్పారు. ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ లపై ఓ కన్నేసి ఉంచాలని తమ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఆదేశించారన్నారు. తాము 8 గంటల చొప్పున మూడు షిఫ్టులు వేసుకుని స్ట్రాంగ్ రూమ్ కు కాపు కాస్తున్నామని చెప్పారు. యూపీలో గెలిచేది బీజేపీనే అన్న ఎగ్జిట్ పోల్ సర్వేలపై తమకు నమ్మకం లేదని, అధికారంలోకి రాబోయేది సమాజ్ వాదీ పార్టీనే అని యోగేశ్ అన్నారు. భారీ మెజారిటీతో అఖిలేశ్ యాదవ్ సీఎం కాబోతున్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తల కోసం..

నా సక్సెస్ వెనుక ఆమె: చిరంజీవి

పక్క రాష్ట్రాల సెక్రటేరియట్ల కంటే మన కలెక్టరెట్లు బాగున్నయ్

ఐఫోన్లు వదిలి ‘అయ్యా’కు మారండి