పక్క రాష్ట్రాల సెక్రటేరియట్ల కంటే మన కలెక్టరెట్లు బాగున్నయ్

పక్క రాష్ట్రాల సెక్రటేరియట్ల కంటే మన కలెక్టరెట్లు బాగున్నయ్

వనపర్తి జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక కరువు జిల్లాలో కరువు పోయి పంటలు పండుతున్నాయని సీఎం కేసీఆర్ అన్నారు. 24 గంటల కరెంట్‎తో రైతులు కష్టపడి పంటలు పండిస్తున్నారని ఆయన అన్నారు. సీఎం ఫండ్ నుంచి వనపర్తికి కోటి, మున్సిపాలీటిలకు 50 లక్షలు, గ్రామపంచాయతీలకు 20 లక్షలు ప్రకటించారు. 

‘అనేక విషయాలలో తెలంగాణ నెంబర్ 1గా ఉంది. తలసరి విద్యుత్ వినియోగంలో నెంబర్ వన్ గా ఉన్నాం. వ్యక్తిగత ఆదాయంలో కూడా ముందున్నాం. వనపర్తి జిల్లా నుంచి మన ఊరు మన బడి కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. కలెక్టరెట్ ఆఫీసు చూస్తే చాలా గొప్పగా ఉంది. పక్క రాష్ట్రాలలో సెక్రటేరియట్ కంటే మన రాష్ట్రంలోని కలెక్టరెట్ ఆఫీసులు చాలా బాగున్నాయి. ఉద్యోగుల కోసం అన్నీ చేస్తున్నాం. ఉపాధ్యాయుల ప్రమోషన్లు కూడా ఇవ్వమని సీఎస్‎కు చెప్తున్నాను. ఉత్తమ ఉద్యోగ రూల్స్ అమలుచేయాలని ఆదేశిస్తున్నాను. రిటైర్‎మెంట్ రోజే సన్మానం చేసి బెనిఫిట్స్ అన్నీ అందచేసి.. అధికారిక వాహనంలో ఇంటి దగ్గర దింపి రావాలి. రాష్ట్రం ప్రగతి పథంలో నడుస్తోంది. ఒక్క రోజులో ఏదీ సాధ్యం కాలేదు.  ఇప్పటివరకు సాధించింది చాలా తక్కువ. బాధపడినోళ్లం కాబట్టి.. ఒక్కొక్కటి బాగుచేసుకుంటున్నాం’ అని సీఎం కేసీఆర్ అన్నారు.

మన తెలివి ఎట్లుంటదంటే.. ఉషారెడ్డి లాగా ఉంటది
వనపర్తి కలెక్టరెట్ ఆఫీసు ఆర్కిటెక్చర్ గా పనిచేసిన ఉషా రెడ్డిని సీఎం మెచ్చుకున్నారు. తెలంగాణ తెలివి ఎలా ఉంటుందో చూపించిందని అన్నారు. ఉషారెడ్డి భువనగిరి బిడ్డ అని ఆయన గుర్తుచేశారు.