- ఏర్పాట్లు పూర్తి చేసిన ఆఫీసర్లు
- 3,360 బస్సులు నడపనున్న ఆర్టీసీ
జయశంకర్‌భూపాలపల్లి/మహదేవూర్, వెలుగు : త్రివేణి సంగమ క్షేత్రమైన కాళేశ్వరం పుష్కర శోభను సంతరించుకుంది. గోదావరి తీరంలో సినిమా సెట్టింగ్ తరహాలో ఏర్పాటు చేసిన కేఎంకే డెకరేషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది. సరస్వతి అంత్య పుష్కరాలకు మరో రెండు రోజులే మిగిలి ఉండడంతో ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయి. 12 రోజుల పాటు పుష్కర స్నానాలకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రధాన ఘాట్‌తో పాటు సరస్వతి ఘాట్ వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. నదిలో నీటి మట్టాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ భక్తులు లోతైన ప్రాంతానికి వెళ్లకుండా ప్రతి 50 మీటర్లకు రక్షణ బారికేడ్లను ఏర్పాట్లు చేస్తున్నారు. గజ ఈతగాళ్లను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. వీఐపీల రాక కోసం హెలీప్యాడ్ నిర్మాణం చేపట్టారు. పనుల్లో వేగం పెంచేలా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ పనులను పరిశీలిస్తూ ఆఫీసర్లతో రివ్యూ చేపట్టారు. పనుల్లో వేగం పెంచాలని ఆదేశాలు జారీ చేశారు. మే 21 నుంచి జూన్ 1 వరకు స్పెషల్ బస్సులు : ఆర్టీసీ వరంగల్ రీజియన్ మేనేజర్ భవానీ ప్రసాద్
వరంగల్, వెలుగు : ఈ నెల 21 నుంచి జూన్ 1 వరకు జరగనున్న సరస్వతి అంత్య పుష్కరాల కోసం 3,360 బస్సులతో 5,772 ట్రిప్పులు నడపనున్నట్లు ఆర్టీసీ వరంగల్ రీజియన్ మేనేజర్ ఎస్.భవానీ ప్రసాద్ తెలిపారు. ప్రస్తుతం హనుమకొండ - కాళేశ్వరం మార్గంలో భూపాలపల్లి, పరకాల, నర్సంపేట, హనుమకొండ, వరంగల్ 1 డిపోల నుంచి 59 బస్సులు నడుస్తున్నాయన్నారు.
పుష్కరాలు ప్రారంభమైన రోజు నుంచి వరంగల్ రీజియన్ పరిధిలోని 9 డిపోల నుంచి సేవలు అందించనున్నట్లు వెల్లడించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కాళేశ్వరంలో 4.36 ఎకరాల్లో తాత్కాలిక బస్‌స్టేషన్ ఏర్పాటు చేశామని, ప్రయాణికుల కోసం వెయిటింగ్ షెడ్లు నిర్మించామని చెప్పారు.
