సైబర్ నేరగాళ్లకు అడ్డాగా సత్తుపల్లి!

సైబర్ నేరగాళ్లకు అడ్డాగా సత్తుపల్లి!
  •     పలు దేశాలకు సంబంధించి రూ.570 కోట్ల మేర స్కాంలో 55 మంది వరకు గతంలో అరెస్ట్
  •     తాజాగా హైదరాబాద్ లో నమోదైన కేసులో పట్టాభి అరెస్ట్
  •     హైదరాబాద్ లో కాల్ సెంటర్ ద్వారా ఆస్ట్రేలియావాసులను రూ.100 కోట్ల వరకు మోసం చేశారని కేసు
  •     జనం సొమ్ముతో సైబర్ నేరగాళ్ల జల్సాలు, విచ్చలవిడిగా ఖర్చు

ఖమ్మం, వెలుగు: రాష్ట్రంలో సైబర్​ నేరగాళ్లకు ఖమ్మం జిల్లా సత్తుపల్లి అడ్డాగా మారింది. దేశ విదేశాలకు చెందిన వారి నుంచి రూ.వందల కోట్ల విలువైన సైబర్​ ఫ్రాడ్ కు పాల్పడిన కేసుల్లో మూలాలు సత్తుపల్లి నియోజకవర్గంలో బయటపడడం కలకలం రేపుతోంది.  ఈ ఏడాది జనవరిలో దాదాపు రూ.570 కోట్ల విలువైన స్కామ్​లో సూత్రధారులు, పాత్రధారులందరూ ఇక్కడి వారే కాగా, బాధితులు మాత్రం పదుల సంఖ్యలో దేశాలకు చెందిన వారున్నారు. ఆ కేసును ఎంక్వైరీ చేస్తున్న క్రమంలో స్కామ్​ విలువ రూ.వెయ్యి కోట్లకు మించడంతో పోలీస్​ అధికారులే ముక్కున వేలేసుకున్నారు. తాజాగా హైదరాబాద్​లో నమోదైన మరో కేసులో కల్లూరు మండలం లింగాలకు చెందిన దేవరపల్లి పట్టాభిని సైబర్​ సెక్యూరిటీ సిట్  అధికారులు అరెస్ట్  చేయడంతో మళ్లీ సత్తుపల్లి పేరు మారుమోగుతోంది. 

కాల్  సెంటర్లతో రూ.వేల కోట్ల దందా!

సత్తుపల్లిలో బయటపడుతున్న సైబర్​ ఫ్రాడ్​ కేసుల్లో నిందితులు వేరైనా, మోసం చేసే విధానం మాత్రం దాదాపు ఒకేలా ఉంటున్నాయి. హైదరాబాద్​తో పాటు కంబోడియా వంటి దేశాల్లో కాల్ సెంటర్లను ఏర్పాటు చేయడం, కొందరిని ఉద్యోగులుగా నియమించుకొని వేరే దేశాలకు చెందిన వారిని ఫోన్​ కాల్స్ ద్వారా ట్రాప్​ చేయడం కామన్​గా కనిపిస్తోంది. ఇలా మోసపోయిన వారిలో మన దేశంలోని ఇతర రాష్ట్రాలకు చెందిన వారితో పాటు సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా వంటి దేశాలకు చెందిన వారున్నారు. మ్యాట్రిమోనీ, రివార్డు పాయింట్లు, గేమింగ్, బెట్టింగ్, షేర్​ మార్కెట్లో పెట్టుబడులు, క్రిప్టో కరెన్సీలో ట్రేడింగ్.. ఇలాంటి వేర్వేరు టాపిక్​లతో అమాయకులకు ఫోన్  కాల్స్  చేసి ట్రాప్​ చేయడం, వారిని టెలిగ్రామ్​ గ్రూపుల్లో చేర్చి పెట్టుబడుల పేరుతో డబ్బులు రాబట్టడం, మోసపూరిత లింకులు, ఏపీకే ఫైల్స్​ ద్వారా వారి బ్యాంకు అకౌంట్లను ఖాళీ చేసేవారు. 

వాటిని తెలిసిన వారి మ్యూల్​ అకౌంట్ల ద్వారా సొంత కరెంట్ అకౌంట్లకు ట్రాన్స్ ఫర్ చేయడం, మళ్లీ తిరిగి వాటిని కంబోడియా ఏజెంట్లు, చైనా ఏజెంట్ల ద్వారా యూఎస్​ డాలర్, క్రిప్టో కరెన్సీలోకి మార్చినట్టు పోలీస్  అధికారుల ఎంక్వైరీలో తేలింది. ఈ నిందితులు వాడిన బ్యాంక్​ అకౌంట్లను నేషనల్  సైబర్​ క్రైమ్  రిపోర్టింగ్  పోర్టల్ లో పరిశీలిస్తే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వందల సంఖ్యలో సైబర్​ క్రైమ్ ఫిర్యాదులున్నట్టు బయటపడింది. సత్తుపల్లి రూరల్, పెనుబల్లి పోలీస్​స్టేషన్లలో రిపోర్ట్ అయిన కేసుల్లో నిందితులకు సహకరించిన ప్రైవేట్  బ్యాంకు సిబ్బంది ముగ్గురితో పాటు 55 మందిని అరెస్ట్  చేశారు. 

కొల్లగొట్టిన సొమ్ముతో జల్సాలు

జనవరిలో బయటపడిన స్కామ్​లో పోట్రు మనోజ్  కల్యాణ్, ఉడతనేని వికాస్  చౌదరి, పోట్రు ప్రవీణ్, మేడా భానుప్రియ, మేడా సతీశ్, మోరంపూడి చెన్నకేశవ సహా ప్రధాన నిందితుల బ్యాంకు అకౌంట్లలో ట్రాన్సాక్షన్స్  విలువే రూ.570 కోట్లు దాటింది. తాజాగా అరెస్ట్  అయిన దేవరపల్లి పట్టాభితో పాటు 9 మందిపై గతేడాది నవంబర్​లో ఎఫ్ఐఆర్  2934/2025తో రూ.90 కోట్ల విలువైన సైబర్  ఫ్రాడ్  కేసు నమోదైంది. విదేశీయులను టార్గెట్  చేసుకొని, వివిధ రకాలుగా నమ్మించి డబ్బులు దోచుకున్నట్టు కేసు నమోదైంది. అప్పట్లో పోలీసులకు చిక్కకుండా విదేశాలకు పారిపోయిన పట్టాభి, ఇటీవల హైదరాబాద్  రావడంతో పట్టుకున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం సైబర్  నేరాలకు సంబంధించి సిట్ ను ఏర్పాటు చేసి, అన్ని స్టేషన్లలోని సైబర్  కేసులను బదిలీ చేయగా వేర్వేరు కేసుల్లో పట్టాభిని కీలక నిందితుడిగా గుర్తించి అరెస్ట్  చేసినట్లు సమాచారం. 

ఈ నిందితులంతా స్కామ్​ల ద్వారా కొల్లగొట్టిన రూ.వందల కోట్ల సొమ్ముతో గత కొన్నేళ్లుగా సత్తుపల్లితో పాటు హైదరాబాద్​లో హల్ చల్ చేస్తున్నారు. ప్రైవేట్  జెట్ విమానాల్లో ప్రయాణాలు, లగ్జరీ కార్లను కొనుగోలు చేయడం, కుటుంబ సభ్యులు, బినామీల పేర్లతో వందల ఎకరాలను కొనుగోలు చేయడం, రేంజ్ రోవర్, బెంజ్ కార్లలో తిరగడం, సొంతూరికి వస్తే బౌన్సర్లను ఏర్పాటు చేసుకోవడం వంటి జల్సాలు చేశారు. సర్పంచ్  ఎన్నికల్లోనూ డబ్బు కుమ్మరించారు. లింగాలలో పట్టాభి తండ్రి సర్పంచ్​గా పోటీ చేయగా ఆ ఎన్నికల కోసం రూ.3 కోట్లకు పైగా ఖర్చు చేసినట్టు తెలుస్తోంది.

మరికొందరు ఎంట్రీ..!

గత కొన్నేళ్లుగా సైబర్​ నేరాలకు పాల్పడుతున్న నిందితులు, వాళ్ల విలాసాలు చూసి కొత్తగా మరికొంత మంది ఇలాంటి దందాల్లోకి ఎంటర్  అవుతున్నారు. సులువుగా వందల కోట్లు సంపాదించి ఎంజాయ్​ చేయొచ్చనే భావనతో ఉంటున్నారు. హైదరాబాద్​లో హానర్  హోమ్స్  కంపెనీ ఎండీ ఫొటోను వాడుకొని, ఆ సంస్థ ఉద్యోగిని మోసం చేసి రూ.4.70 కోట్లు కొల్లగొట్టారు. ఈ కేసులో గత నెలలో సత్తుపల్లికి చెందిన మండపల్లి శివనాగరాజు, దోసపాటి కృష్ణసాయిని పోలీసులు అరెస్ట్  చేశారు. ఇలా ఒకరిని చూసి మరొకరు సైబర్​ ఫ్రాడ్ కు పాల్పడుతుండడంతో కొత్తగా మరెవరి పేరు బయటకు వస్తుందన్న చర్చ జరుగుతోంది.