V6 News

సెమీస్‌లో సాత్విక్ జోడీ, క్వార్టర్స్‌‌లోనే ఓడిన సైనా

సెమీస్‌లో సాత్విక్ జోడీ, క్వార్టర్స్‌‌లోనే ఓడిన సైనా

పారిస్‌‌: ఇండియా డబుల్స్‌‌ షట్లర్లు సాత్విక్‌‌ సాయిరాజ్‌‌-–చిరాగ్‌‌ షెట్టి ఫ్రెంచ్‌‌ ఓపెన్‌‌ టైటిల్‌‌కు రెండు అడుగుల దూరంలో నిలిచారు. గత మ్యాచ్‌‌లో వరల్డ్‌‌ చాంపియన్‌‌ జోడీకి షాకిచ్చిన ఈ యువ ద్వయం.. క్వార్టర్స్‌‌లో తమకంటే మెరుగైన ర్యాంకర్‌‌కు చెక్‌‌ పెడుతూ సెమీస్‌‌కు దూసుకెళ్లింది. అయితే, స్టార్‌‌ షట్లర్‌‌ సైనా నెహ్వాల్‌‌ క్వార్టర్స్‌‌లోనే వెనుదిరిగి మరోసారి నిరాశ పరిచింది.

శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్‌‌ క్వార్టర్‌‌ఫైనల్లో సాత్విక్‌‌-–చిరాగ్‌‌ జంట 21–13,22–20తో కిమ్ అస్ట్రప్‌‌– ఆండర్స్‌‌ స్కారప్‌‌ (డెన్మార్క్‌‌) జోడీపై ఉత్కంఠ విజయం సాధించింది. తొలి గేమ్‌‌ను అలవోకగా గెలిచిన ఇండియా ద్వయానికి సెకండ్‌‌ గేమ్‌‌లో మాత్రం ప్రత్యర్థి నుంచి ప్రతిఘటన ఎదురైంది. రెండో గేమ్‌‌ను 4–0తో ప్రారంభించినప్పటికీ డెన్మార్క్ ద్వయం అనూహ్యంగా ప్రతిఘటించడంతో వరుస పాయింట్ల కోల్పోయి 12–16తో వెనుకబడింది. చివర్లో స్కోర్లు 20–20తో సమానమైనప్పటికీ.. వరుసగా రెండు పాయింట్లు సాధించిన ఇండియా జోడీ గేమ్‌‌తో పాటు మ్యాచ్‌‌ను గెలుచుకుంది.

ఇక, మహిళల సింగిల్స్‌‌ క్వార్టర్స్‌‌లో తొమ్మిదో సీడ్‌‌ సైనా 20–22, 21–23తో 16 ర్యాంకర్‌‌‌‌ అన్‌‌ సే యాంగ్‌‌ (కొరియా) చేతిలో పోరాడి ఓడింది. 49 నిమిషాలపాటు జరిగిన ఈ హోరాహోరీ పోరులో సైనాపై యాంగ్‌‌ పైచేయి సాధించింది. తొలి గేమ్‌‌ను యాంగ్‌‌ 7–2తో ప్రారంభించగా.. అద్భుత ఆటతీరుతో దూసుకొచ్చిన సైనా 15–12తో ఆధిక్యంలో నిలిచింది. కానీ, అదిరే డ్రాప్‌‌ షాట్లతో విజృంభించిన కొరియా 20–19తో లీడ్‌‌లోకి దూసుకెళ్లింది. ఆ వెంటనే వరుసగా మూడు పాయింట్లతో గేమ్‌‌ను సొంతం చేసుకుంది. రెండో గేమ్‌‌లో కూడా 5–2తో ఆధిపత్యం కనబర్చగా.. పుంజుకున్న సైనా 7–5తో లీడ్​లోకి వచ్చింది. కానీ, పోరాటం ఆపని యాంగ్‌‌ వరుస పాయింట్లతో 16–11 మరోసారి ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ దశలో స్మాష్‌‌ షాట్లతో రెచ్చిపోయిన సైనా 18–18తో స్కోరు సమం చేసింది. చివర్లో పాయింట్ల కోసం ఇరువురు హోరాహోరీగా తలపడగా.. ఫోర్ హ్యాండ్‌‌ షాట్లతో పై చేయి సాధించిన కొరియా షట్లర్‌‌ గేమ్‌‌తో పాటు మ్యాచ్‌‌ సొంతం చేసుకుంది.