- శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
బషీర్బాగ్, వెలుగు: ఎంతో ప్రాచీనమైన ఇంద్రజాల కళకు నేడు ఆదరణ కరువై మరుగున పడిపోతోందని, దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం జానపద కళల శాఖ, మెజీషియన్స్ అకాడమీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రముఖ మేజిషియన్ పీసీ సర్కార్ జయంతిని పురస్కరించుకొని ‘జాతీయ మెజీషియన్స్ డే’ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరై మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం నుంచి మెజీషియన్స్ కు సహకారం అందించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం తెలుగు వర్సిటీ మెజీషియన్ కోర్సు డైరెక్టర్ సామల వేణు మాట్లాడుతూ.. ఈ దినోత్సవం ద్వారా మూఢనమ్మకాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.
ఈ సందర్భంగా మెజీషియన్ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేయగా, పలువురు మేజిషియన్లు ప్రదర్శించిన విన్యాసాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సదస్సులో వర్సిటీ రిజిస్ట్రార్ కోట్ల హనుమంతరావు, ప్రొఫెసర్ నిత్యానందరావు, డాక్టర్ విజయ్ పాల్ తదితరులు పాల్గొన్నారు.
