మ్యాజిక్‌‌తో డబ్బులు డబుల్ చేస్తానని మోసం

మ్యాజిక్‌‌తో డబ్బులు డబుల్ చేస్తానని మోసం
  • ఐవరీకోస్ట్  దేశస్థుడి అరెస్టు
  • రూ.10 లక్షల ఫేక్  కరెన్సీ స్వాధీనం

ఎల్బీ నగర్, వెలుగు: మ్యాజిక్ చేసి డబ్బులు డబుల్ చేస్తానని నకిలీ నోట్లతో జనాన్ని మోసం చేస్తున్న ఐవరీకోస్ట్  దేశానికి చెందిన వ్యక్తిని ఎల్బీ నగర్  పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని జాన్ గయ్ రోస్టండ్ అలియాస్  డౌడా (46)గా గుర్తించారు. అతని నుంచి రూ.10 లక్షల నకిలీ ఇండియన్ కరెన్సీ, కరెన్సీ పేపర్  బండిల్స్, కెమికల్ బాటిల్స్, జిరాక్స్ మెషీన్లు, నకిలీ నోట్ల తయారీ మెషీన్​ను స్వాధీనం చేసుకున్నారు. ఐవరీకోస్ట్​కు చెందిన జాన్ గయ్ రోస్టండ్  2021లో విజిటింగ్ వీసాపై ఇండియా వచ్చాడు. డౌడాగా పేరు మార్చుకొని నకిలీ ఇండియన్ కరెన్సీ రూ.500 నోట్లను తయారు చేసి సోషల్ మీడియా వేదికగా డబ్బులు డబుల్ చేస్తానని కొన్ని వీడియోలు, ఫొటోలు పోస్టులు చేశాడు. పోస్టులో తన నంబర్  కూడా ఉంచాడు.

తనను బాధితులు నమ్మేందుకు తన ఎడమ చేతిలో రూ.500 ఒరిజినల్ కరెన్సీ నోట్లు రెండింటిని దాస్తాడు. బాధితుల నుంచి ఒక రూ.500 ఒరిజినల్ నోటు తీసుకొని కరెన్సీ సైజ్​లోనే ఉన్న రెండు తెల్ల కాగితాల మధ్యలో పెడతాడు. ఆ తర్వాత వాటిపై కొన్ని కెమికల్స్ చల్లి ఒక ఎన్వలప్  కవర్​లో ఆ తెల్ల కాగితాలు, బాధితులు ఇచ్చిన కరెన్సీ నోటును పెట్టి ఓ పాత్రలో ఎన్వలప్​ను ముంచుతాడు. ఎడమ చేతిలో ఉన్న ఒరిజినల్  కరెన్సీ నోట్లను పాత్రలో వదిలేసి నకిలీ నోట్లను బయటకు తెస్తాడు. సోషల్ మీడియాలో ఆ వీడియోలను చూసిన వారు ఆశపడి డౌడాను సంప్రదించారు. హైదరాబాద్​కు చెందిన ఓ వ్యక్తి రూ.5 లక్షలు ఇచ్చి మోసపోయాడు. బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో కేసు నమోదు చేసి నిందితుడిని ఎల్బీ నగర్​లో రాఘవేంద్ర హోటల్ అరెస్ట్​ చేశారు.