హైదరాబాద్​లో డెంగీ..  ఏజెన్సీలో మలేరియా

హైదరాబాద్​లో డెంగీ..  ఏజెన్సీలో మలేరియా
  • మెరుగుపడని పారిశుధ్యం.. అందని వైద్యం
  • దోచుకుంటున్న ప్రైవేటు ఆస్పత్రులు
  • ముందస్తు చర్యలపై దృష్టిపెట్టని సర్కారు
  • శానిటేషన్‌‌ కోసం మున్సిపాలిటీలు, 
  • పంచాయతీలకు పైసా ఇయ్యలే
  • తూతూమంత్రంగా ఫాగింగ్, బ్లీచింగ్
  • పేరుకుపోతున్న మురుగు, చెత్త

హైదరాబాద్/నెట్‌‌వర్క్, వెలుగు: రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా డెంగీ, మలేరియా, టైఫాయిడ్ లాంటి జ్వరాలు ప్రబలుతున్నాయి. దోమల వల్ల డెంగీ, మలేరియా.. కలుషిత ఆహారం, నీటి వల్ల టైఫాయిడ్‌‌ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇండ్ల చుట్టూ నీళ్లు నిలిచిపోవడం, డ్రైనేజీలు నిండిపోవడం, ఓపెన్​ప్లాట్లన్నీ మురికి కుంటల్లా మారడంతో దోమలు వృద్ధి చెంది డెంగీ విజృంభిస్తోంది. వర్షాకాలం ప్రారంభంలోనే పారిశుధ్య చర్యలు చేపట్టాల్సిన సర్కారు ఆ దిశగా ప్రయత్నాలు చేయలేదు. వర్షాలు పడి, వరదలు వచ్చిపోయిన తర్వాత తీసుకుంటున్న చర్యలు కూడా అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. గ్రామాల్లో జ్వరాల ప్రభావం ఎక్కువగా ఉండడంతో రోగులు పీహెచ్‌‌సీలకు క్యూ కడుతున్నారు. కానీ పీహెచ్‌‌సీల్లో డాక్టర్​పోస్టులు వందల్లో ఖాళీగా ఉండడంతో అక్కడ వైద్యం సరిగా అందట్లేదు.  దీంతో దిక్కులేక ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా ప్రైవేట్​ ఆస్పత్రులు అందినకాడికి దండుకుంటున్నాయి. ముఖ్యంగా డెంగీ పేరుతో ప్లేట్​లెట్స్​తగ్గాయని భయపెడుతూ దోపిడీ చేస్తున్నాయి. టెస్టుల పేరుతోనే వేలకు వేలు గుంజుతున్నాయి.

డేంజర్ జోన్‌‌లో భద్రాచలం

వరద ముంపుకు గురైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం, బూర్గంపహాడ్​, మణుగూరు, అశ్వాపురం, చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో ఎక్కువగా మలేరియా కేసులు నమోదవుతున్నాయి. విడువని వానలతో మలేరియా, డెంగీ కేసులు ఇంకా పెరిగే ప్రమాదం ఉందని వైద్య అధికారులు హెచ్చరిస్తున్నారు. వందల మంది టైఫాయిడ్, ఇతర వైరల్ ఫీవర్స్‌‌తో బాధ పడుతున్నారు. నాలుగైదు రోజులుగా రోజుకు 10 నుంచి 17 వరకు కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇల్లెందు, కొత్తగూడెం, మణుగూరు, పాల్వంచ మున్సిపాలిటీల్లో పారిశుధ్యం అధ్వానంగా తయారైంది. ఫాగింగ్ కూడా చేయడంలేదు. జిల్లాలోని పంచాయతీలు, మున్సిపాలిటీలకు చెందిన పారిశుధ్య కార్మికులను గోదావరి వరద ముంపు ప్రాంతాలకు తరలించడంతో మిగతా ప్రాంతాల్లో శానిటేషన్ దెబ్బతిన్నది.

హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో డెంగీ డేంజర్ బెల్స్ మోగిస్తున్నది. ఒక్క హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోనే 751 డెంగీ కేసులు వచ్చాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తర్వాతి స్థానాల్లో రంగారెడ్డి, కరీంనగర్, మేడ్చల్ ఆదిలాబాద్ జిల్లాలు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా డెంగీ కేసుల సంఖ్య 1,610 దాటింది. జులైలో 648 కేసులు వచ్చినట్లు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ప్రైవేటులో నమోదవుతున్న కేసులను కలిపితే ఈ సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉంది. దోమలను అరికట్టేందుకు చర్యలు తీసుకోకపోవడం, జనసాంద్రత ఎక్కువ ఉండటంతో ఈ ప్రాంతాల్లో డెంగీ కేసులు ఎక్కువగా వస్తున్నాయి. ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కేసులు మరింత పెరిగే చాన్స్ ఉందని ఆఫీసర్లు హెచ్చరిస్తున్నారు.

వరద జిల్లాల్లో మలేరియా గుబులు

ఏజెన్సీ ప్రాంతాల్లో మలేరియాను దాదాపుగా కంట్రోల్ చేశామని మొన్నటిదాకా రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకున్నది. ఇప్పుడు ఆ జిల్లాల్లోనే కేసులు పెరుగుతున్నాయి. వరద జిల్లాల్లో పారిశుధ్యాన్ని సర్కారు పెద్దగా పట్టించుకోలేదు. ఫాగింగ్, శానిటేషన్, బ్లీచింగ్.. ‘ఏదో చేశాం’ అన్నట్లుగా పూర్తి చేసింది. దీంతో ఇటీవల కురిసిన వర్షాలు, వరదలకు నష్టపోయిన భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో మలేరియా గుబులు రేపుతున్నది. వరద తగ్గిన తర్వాత ఎక్కడికక్కడ లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు నిలిచిపోయాయి. అక్కడ ప్రభుత్వం డీవాటరింగ్ చేయలేదు. గ్రామాల్లోకి, ఇండ్లలోకి బురద కొట్టుకొచ్చింది. క్లీనింగ్‌‌‌‌‌‌‌‌కు రోజుల తరబడి టైం పట్టడం.. అప్పటికే నీళ్లు మురికిగా మారి, దోమలు చేరి రోగాలకు కారణమవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 260 మలేరియా కేసులు రాగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 142 కేసులు, ములుగు జిల్లాలో 52 వచ్చాయి.

కలవరపెడుతున్న డయేరియా

డయేరియా, చికెన్ గున్యా కేసులు పెరుగుతున్నాయి. రెండు నెలల్లో 12,610 డయేరియా కేసులు నమోదయ్యాయి. ఇందులో చిన్నపిల్లలే ఎక్కువగా ఉన్నారు. కలుషిత నీటి కారణంగానే డయేరియా బారిన పడుతున్నారు. హైదరాబాద్, ఆదిలాబాద్, సంగారెడ్డి, నిర్మల్, నారాయణపేట్, వనపర్తి, భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లిలో ఎక్కువ కేసులు వచ్చినట్లు ఆఫీసర్లు పేర్కొన్నారు. చికెన్‌‌‌‌‌‌‌‌గున్యా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. 

జిల్లాల్లో పరిస్థితి ఇలా..

వరంగల్‌‌‌‌‌‌‌‌లోని ఎంజీఎంలో గతంలో రోజుకు సగటున 2 వేల నుంచి 2,500 దాకా ఓపీ కేసులు నమోదయ్యేవి. కానీ సోమ, మంగళవారాల్లో రోజుకు 4 వేల చొప్పున ఓపీ నమోదవుతున్నది. భద్రాద్రి జిల్లాలో జనవరి నుంచి ఇప్పటివరకు154 మలేరియా కేసులు వచ్చాయి. జూన్​నుంచి 53 కేసులు నమోదయ్యాయి. కొత్తగూడెంలోని జిల్లా జనరల్ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో ఓపీ 600 నుంచి 800 వరకు పెరిగింది. ఖమ్మంలో జులైలో 40 టైఫాయిడ్, 39 డెంగీ, 36 చికెన్‌‌‌‌‌‌‌‌ గున్యా కేసులు నమోదయ్యాయి. వరద ఎక్కువగా ఉన్న పెద్దపల్లి జిల్లాలో 16 మలేరియా, 34 టైఫాయిడ్ కేసులు వచ్చాయి. ఆదిలాబాద్ జిల్లాలో 2 నెలల్లో 2,090 వైరల్ ఫీవర్ కేసులు వచ్చాయి. ఆసిఫాబాద్ జిల్లాలో 7 డెంగీ, 24 మలేరియా, 21 టైఫాయిడ్ కేసులు నమోదయ్యాయి. డెంగీ లక్షణాలతో ఇటీవల మెదక్ జిల్లా తుప్రాన్‌‌‌‌‌‌‌‌కు చెందిన యువకుడు చనిపోయాడు. కరీంనగర్ జిల్లాలో వైరల్ ఫీవర్స్ వల్ల గవర్నమెంట్ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో ఓపీ పెరుగుతున్నది. గత వారం 400గా ఉన్న  ఓపీ.. మంగళవారం 600కు చేరింది. జిల్లాలో జూన్, జులై నెలల్లో 182  టైఫాయిడ్ కేసులు వచ్చాయి.    నిజామాబాద్ జిల్లాలో రెండు నెలల్లో 26 డెంగీ, 5 మలేరియా కేసులు నమోదయ్యాయి. వారం నుంచి వైరల్ జ్వరాలతో వస్తున్న ఔట్ పేషెంట్ల సంఖ్య 850 నుంచి 1,050కు పెరిగింది.
మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్ జిల్లాలో జూన్ 1 నుంచి ఇప్పటి వరకు 60 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఈ నెల మొదటి వారంలో జిల్లా జనరల్ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కు 1,200 మంది ఓపీకి రాగా.. ఇప్పుడు అది దాదాపు 1,700కు పెరిగింది.

ముందస్తు చర్యలేవి?

వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉండటంతో సర్కారు ముందుగానే సిద్ధం కావాలి. దోమల నివారణకు శానిటేషన్ చేయాలి. బ్లీచింగ్, ఫాగింగ్ చేయాలి. నీళ్లు నిల్వ ఉన్నచోట్ల కెమికల్ స్ప్రే చేయాలి. వీటన్నింటిపై ముందు దృష్టి పెట్టని ప్రభుత్వం.. వారం, పది రోజుల పాటు ఏకధాటిగా వర్షాలు కురిసి, వరదలు పోటెత్తిన తర్వాత మేల్కొంది. అయితే అప్పటికే డెంగీ, మలేరియా విజృంభణ మొదలైంది. ఇప్పుడు అంటువ్యాధులు, సీజనల్ రోగాలు రాకుండా చర్యలు చేపట్టాలంటూ ఆదేశాలిచ్చింది. ములుగు, కొత్తగూడెం, భూపాలపల్లి జిల్లాలకే పరిమితం చేసి తూతూ మంత్రంగా పనులు చేస్తున్నారు. అన్ని జిల్లాల్లో పరిశుభ్రత చర్యలు తీసుకోవాలని సోమవారం మంత్రి హరీశ్ ఆదేశాలిచ్చారు. వరదలకు రోడ్లు దెబ్బతినడంతో గ్రామాలు, పట్టణాల్లో ఎక్కడికక్కడ గుంతలు ఏర్పడి వాటిలో నీరు నిల్వ ఉండడంతో దోమలు పెరుగుతున్నాయి. 

హైరిస్క్ ప్రాంతాల్లో బ్లీచింగ్ చేస్తున్నం

భారీ వర్షాలు, వరదలతో మలేరియా, డెంగీ కేసులు పెరుగుతు న్నాయి. జిల్లా అంతటా బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్నాం. జిల్లాలో 215 హాబిటేషన్లను మలేరియా హైరిస్క్ ప్రాంతాలుగా గుర్తించాం. డెంగీ నిర్ధారణ కోసం ఇల్లెందు, కొత్తగూడెం, భద్రాచలం, మణుగూరులో ఎలిసా టెస్ట్‌‌‌‌‌‌‌‌లు చేస్తున్నాం. 
- దయానందస్వామి, డీఎంహెచ్​ఓ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా