సికింద్రాబాద్ లో చోరీ.. గోవాలో దొంగను పట్టుకున్న పోలీసులు .. అరకిలో బంగారం ఎత్తుకెళ్లిన అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్

సికింద్రాబాద్ లో  చోరీ.. గోవాలో దొంగను పట్టుకున్న పోలీసులు .. అరకిలో బంగారం ఎత్తుకెళ్లిన అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్
  • రూ.82 లక్షల సొత్తు స్వాధీనం

పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో బంగారు, వెండి ఆభరణాల చోరీ కేసును పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. లగ్జరీలకు అలవాటుపడి దేశవ్యాప్తంగా దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను గోవాలో అరెస్ట్​చేశారు. అతని వద్ద నుంచి రూ. 82 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు మల్కాజ్‌‌‌‌గిరి డీసీపీ శ్రీధర్ గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. 

గత నెల 27న రాత్రి సికింద్రాబాద్ పాట్ మార్కెట్‌‌‌‌లోని శ్రీ సాయి బులియన్ జ్యువెలరీ షాప్ ఉద్యోగి సందీప్ రఘునాథ్ చవాన్ ఇంటి తాళం పగలగొట్టి, లోపల చెక్క పెట్టెలో దాచిన 576 గ్రాముల బంగారు ఆభరణాలు, 900 గ్రాముల వెండి వస్తువులను ఎత్తుకెళ్లాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 

సాంకేతిక ఆధారాలతో నిందితుడు గోవాకు పారిపోయినట్లు గుర్తించి, ఈ నెల 1న సాయంత్రం నార్త్ గోవాలోని కలంగుట్ పోలీస్ స్టేషన్ పరిధిలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఢిల్లీలోని బురారి, భగత్ కాలనీకి చెందిన మనోజ్ సింగ్‌‌‌‌ అని తేలింది. అతని వద్ద నుంచి రూ.82 లక్షల విలువైన మొత్తం సొత్తును రికవరీ చేశారు. 

మనోజ్ సింగ్ పాత నేరస్థుడని, జల్సాల కోసమే దొంగతనాలు చేస్తూ దేశవ్యాప్తంగా తిరుగుతుంటాడని డీసీపీ తెలిపారు. ఇతనిపై ఢిల్లీలో 19 చోరీ కేసులు ఉన్నాయని, 7 కేసుల్లో తీహార్ జైలులో శిక్ష కూడా అనుభవించాడని పేర్కొన్నారు. పలు నాన్-బెయిలబుల్ వారంట్లు పెండింగ్‌‌‌‌లో ఉన్నాయన్నారు. అరెస్ట్ సమాచారాన్ని ఢిల్లీ పోలీసులకు చేరవేసినట్లు తెలిపారు. మల్కాజ్‌‌‌‌గిరి ఏసీపీ యాదగిరి రెడ్డి, మార్కెట్ సీఐ రామచందర్, డిటెక్టివ్ ఇన్‌‌‌‌స్పెక్టర్ బషీర్ అహ్మద్  ఉన్నారు.

బోయినపల్లిలో రూ.4 లక్షలు, బంగారం చోరీ

ఓల్డ్ బోయినపల్లి భవాని నగర్‌‌‌‌లో చోరీ జరిగింది. చేపల వ్యాపారి పూస స్వామి బుధవారం కుటుంబసభ్యులతో కలిసి గజ్వేల్‌‌‌‌ లోని ఆస్పత్రికి వెళ్లాడు. సాయంత్రం తిరిగి వచ్చేసరికి ఇంటి తాళాలు పగలగొట్టి ఉన్నాయి. లోపలికి వెళ్లి చూడగా.. బీరువా తెరిచి, వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. బీరువాలోని రూ.4 లక్షలు, ఐదున్నర తులాల బంగారం, 19 తులాల వెండి కనిపించకపోవడంతో చోరీ జరిగినట్లు నిర్ధారించుకున్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు డీఐ ఆనంద్ కుమార్ తెలిపారు.