?LIVE UPDATES : చలపతిరావుకు ప్రముఖుల నివాళి

?LIVE UPDATES : చలపతిరావుకు ప్రముఖుల నివాళి

సినిమా ఇండస్ర్టీలో మరో విషాదం నెలకొంది. సీనియర్ నటుడు చలపతిరావు (78) కన్నుమూశారు. ఇవాళ హైదరాబాద్ లో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. చలపతిరావు మృతి పట్ల పలువురు సినీ,రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలుపుతున్నారు. చలపతిరావు ఆత్మకు శాంతి చేకూరాలంటూ పలువురు సినీ ప్రముఖులు సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు. సినీ ప్రముఖులు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించేందుకు ఒక్కొక్కరుగా చలపతిరావు కుమారుడు రవిబాబు ఇంటికి చేరుకుంటున్నారు.

విలక్షణమైన నటనతో అలరించారు : బాలకృష్ణ

‘‘చలపతిరావు హఠాన్మరణం తీవ్రంగా కలిచివేసింది. తన విలక్షణమైన నటనతో తెలుగు ప్రేక్షకులను అలరించారు. నిర్మాతగా మంచి చిత్రాలని నిర్మించారు. ఈ రోజు తెలుగు చిత్ర పరిశ్రమ మంచి నటుడిని కోల్పోయింది. మా కుటుంబంతో ఆయనకు ఆత్మీయ బంధం ఉంది. నాన్నగారితో కలసి ఎన్నో చిత్రాల్లో నటించారు. నా చిత్రాల్లోనూ మంచి పాత్రలు పోషించారు. ఆయన మా కుటుంబ సభ్యుడు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ.. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’ అని బాలకృష్ణ సంతాపం తెలిపారు. 

అందరితో స్నేహంగా ఉండేవారు : దగ్గుబాటి సురేశ్‌

‘‘చలపతిరావు ఎంతో మంచి వ్యక్తి. ఎప్పుడూ సరదాగా ఉండేవారు. ప్రమాదం తర్వాత నుంచి ఆయన ఎక్కువగా బయటకు రాలేదు. ఇండస్ట్రీలో అందరితో స్నేహంగా ఉండేవారు. జోకులు వేస్తూ అందర్నీ నవ్వించేవారు. ఆయన మాకెంతో ఆప్తుడు. మూడు రోజుల క్రితం కూడా షూట్‌లో పాల్గొన్నారు. ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు వరుసగా మృతి చెందడం దురదృష్టకరం. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’’ అని తెలిపారు. 

మరణవార్త కలిచివేసింది : చిరంజీవి

చలపతిరావు మృతి తనను తీవ్రంగా కలిచివేసిందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ‘‘విలక్షణమైన నటుడు, తనదైన శైలిలో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న చలపతిరావు అకాల మరణ వార్త కలచివేసింది. ఎన్నో చిత్రాల్లో చలపతిరావుతో కలిసి నటించాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా. రవిబాబుతోపాటు ఆయన కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతి’’ అని చిరంజీవి తెలిపారు.

కుటుంబ సభ్యుడిని కోల్పోయాం : ఎన్టీఆర్ 

‘‘చలపతిరావు గారి అకాల మరణం నన్ను ఎంతగానో కలచివేసింది. నందమూరి కుటుంబం ఇవాళ ఒక కుటుంబ సభ్యుడిని కోల్పోయింది. తాత గారి రోజుల నుండి మా కుటుంబానికి అత్యంత ఆప్తుడైన ఆయన మృతి మా అందరికీ తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నా ప్రార్థన’’

నందమూరి కల్యాణ్ రామ్ సంతాపం

చలపతిరావు మృతిపట్ల నందమూరి కల్యాణ్ రామ్ సంతాపం వ్యక్తం చేశారు. ‘చలపతిరావు బాబాయి అంటే నాకు ఒక వ్యక్తిగా, నా కుటుంబానికి కూడా చాలా ఇష్టం. ఆయన ఆకస్మిక మరణం మా కుటుంబం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది’ అని ట్వీట్ చేశారు.

ఇండస్ట్రీకి తీరని లోటు : వివేక్ వెంకటస్వామి

ప్రముఖ సీనియర్  నటులు చలపతిరావు మృతిపట్ల బీజేపీ జాతీయ  కార్యవర్గ  సభ్యులు వివేక్  వెంకటస్వామి సంతాపం తెలిపారు. చలపతిరావు  కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. చలపతిరావు మృతి ఇండస్ట్రీకి తీరని లోటని వివేక్  వెంకటస్వామి అభిప్రాయపడ్డారు. 

పవన్ కళ్యాణ్ సంతాపం 

చలపతిరావు కన్నుమూయడం చాలా బాధాకరమని పవన్ కళ్యాణ్ సంతాపం తెలిపారు. సినిమాల్లో ప్రతినాయకుడి పాత్రల్లోనే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనదైన శైలి నటనను చూపించారని గుర్తు చేసుకున్నారు. చలపతిరావు కుమారుడు రవిబాబు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. 

చంద్రబాబు సంతాపం

చలపతిరావు మృతిపట్ల తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి సినిమా ఇండస్ట్రీకి తీరని లోటు అని అన్నారు.