హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో వరుస చోరీలు స్థానికంగా కలకలం రేపాయి. సంపన్నుల ఇళ్లను టార్గెట్ చేస్తూ ఓ అగంతకుడు అర్ధరాత్రి బీభత్సం సృష్టించాడు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 10 పరిధిలో పక్కపక్కనే ఉన్న మూడు ఇళ్లలోకి చొరబడేందుకు యత్నించాడు.
మొదట ప్లాట్ నంబర్ 153లో చోరీకి విఫలయత్నం చేసిన ఆ అగంతకుడు.. ఆ తర్వాత ప్లాట్ నంబర్ 154లోని వ్యాపారి షీతల్ బాంగర్ ఇంట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. అయితే, యజమాని నిద్రలేవడంతో అక్కడి నుంచి పరారయ్యాడు.
అనంతరం ప్లాట్ నంబర్ 147లోని ప్రముఖ వ్యాపారి శైలేందర్ సింగ్ ఇంట్లోకి ప్రవేశించడంలో దొంగ బెడ్‌రూమ్‌లోని కప్‌బోర్డులో దాచిన విలువైన వజ్రాభరణాలు, బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లాడు. ఎమరాల్డ్ వజ్రపు ఉంగరం, రెండు బ్రాస్లెట్లు, నెక్లెస్, చెవి కమ్మలు, మరో బంగారు నెక్లెస్‌తో పాటు పలు విలువైన ఆభరణాలు మాయమైనట్లు గుర్తించారు.
ఉదయం నిద్రలేచిన తర్వాత చోరీ జరిగినట్లు గుర్తించిన శైలేందర్ సింగ్ సతీమణి నీలూ కౌర్ వెంటనే జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. షీతల్ బాంగర్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. రంగంలోకి దిగిన క్రైమ్ పోలీసులు.. సీసీ కెమెరా ఫుటేజీని స్వాధీనం చేసుకుని పరారీలో ఉన్న అగంతకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
