వీరవనితలు.. త్యాగ చరితలు

వీరవనితలు.. త్యాగ చరితలు

జయశంకర్‌‌ భూపాలపల్లి, వెలుగు: మేడారం జాతర ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర. తెలంగాణ రాష్ట్ర పండుగ. దేశంలో కుంభమేళా తర్వాత ఎక్కువ మంది హాజరయ్యే ఈ జాతర రెండేండ్లకోసారి 4 రోజుల పాటు వైభవంగా జరుగుతుంది. ఈ ఉత్సవాలకు సుమారు 700 ఏండ్ల చరిత్ర ఉంది. 1940 వరకు చిలుకల గుట్టమీద జరిగే జాతరకు గిరిజనులు మాత్రమే వచ్చేవాళ్లు. క్రమంగా మన రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి,  మధ్య ప్రదేశ్, ఛత్తీస్ గఢ్​, మహారాష్ట్ర, ఒడిశా  నుంచి జనాలు వస్తుండడంతో రద్దీ పెరిగి కొండ కింద జాతర జరుపుతున్నారు.   

కుంకుమభరిణెగా మారిన సమ్మక్క  
మేడారం విశిష్టతకు సంబంధించి గిరిజనుల్లో రెండు కథలు ప్రచారంలో ఉన్నాయి.  మేడారం కాకతీయుల పరిపాలనలో ఉన్న కాలంలో  వేటకు వెళ్లిన గిరిజనులకు ఒకరోజు సింహాలు, పులులు కాపలా మధ్య పసిపాప కనిపించింది. ఆమెను దేవుడి వరంగా భావించి సమ్మక్క అని పేరు పెట్టి పెంచారు. పెరిగి పెద్దదైన ఆమె చేతిలో ఎంతటి రోగాన్నైనా తగ్గించే శక్తి ఉండేదని నమ్మేవారు. ఆమెకు గిరిజనుల రాజైన పగిడిద్ద రాజుతో పెండ్లి చేశారు. వారి పిల్లలే జంపన్న, సారలమ్మ, నాగులమ్మ. మేడారం కరువు కోరల్లో చిక్కుకున్న టైంలో కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు కప్పం కట్టుమని  పగిడిద్ద రాజుకు వర్తమానం పంపాడు. కట్టలేమన్న  పగిడిద్ద రాజుపై ప్రతాపరుద్రుడు యుద్ధం ప్రకటించాడు. సంపంగి వాగు ఒడ్డున జరిగిన యుద్ధంలో  కాకతీయ సైన్యం గిరిజనుల చేతిలో కుప్పకూలిపోసాగింది. దీంతో కాకతీయ సైన్యం పగిడిద్దరాజును వెనకనుంచి  పొడిచి చంపింది. తన భర్త మరణం గురించి విన్న సమ్మక్క.. కొడుకు జంపన్న,  కూతురు సారలమ్మ, అల్లుడు గోవిందరాజుతో పాటు స్వయంగా  యుద్ధానికి వచ్చింది. సమ్మక్క వీరవిహారం చేయడంతో కాకతీయ సైన్యం కకావికలమైంది. దీంతో సమ్మక్క, సారలమ్మలను కూడా వెనుకనుంచి పొడిచారు. జంపన్నను చంపి, సంపంగి వాగులో పడేశారు. ఆ వాగే  తర్వాత జంపన్న వాగుగా ప్రసిద్ధి చెందింది.  సమ్మక్క ఒళ్లంతా బాణాలతో  చిలకలగుట్ట వైపు వెళ్లింది. ఆమె వెనుకే వెళ్లిన గిరిజనులకు  సమ్మక్కకు బదులు నాగవృక్షం కింద కుంకుమ భరణి కనిపించింది. అప్పటి నుంచి సమ్మక్క కుంకుమ భరణిగా మారిందని, సారలమ్మ మేడారంలోని కన్నెపల్లిలో వెలిసిందని నమ్ముతూ పూజలు చేస్తున్నారు.

మరోకథనం ప్రకారం..సమ్మక్క జగిత్యాల జిల్లా పొలవాస గిరిజన రాజు మేడరాజు ఒక్కగానొక్క బిడ్డ.  ఆమెను మేడరాజు మేనల్లుడు, మేడారం పాలకుడు  పగిడిద్దరాజుకిచ్చి పెండ్లి చేశారు.  కాకతీయ రాజు మొదటి ప్రతాపరుద్రుడు పొలవాసపై దండెత్తగా, ఓడిపోయిన మేడరాజు మేడారం పారిపోయి దాక్కుంటాడు. పగిడిద్దరాజు కప్పం కట్టకపోవడమే కాక మేడరాజుకు ఆశ్రయం ఇచ్చాడన్న కోపంతో కాకతీయులు మేడారం పై  దండెత్తుతారు. ఈ యుద్ధంలో  మేడరాజు, పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవింద రాజు చనిపోగా, ఓటమి వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక సంపెంగ వాగులో దూకి ఆత్మహత్య చేసుకుంటాడు. సమ్మక్క గాయపడి.. చిలుక గుట్టవైపు వెళుతూ మధ్యలోనే అదృశ్యమవుతుంది. ఒక పుట్ట దగ్గర పసుపు, కుంకుమ భరిణె లభించగా దాన్ని సమ్మక్క రూపంగా భావించి, గిరిజనులు  రెండేండ్లకోసారి మాఘ శుద్ద పౌర్ణమి నుంచి జాతర జరుపుతున్నారు.