ఇరుకు గల్లీల్లో వేలాది బండ్లు...ఉప్పల్ లో మొదలైన ట్రాఫిక్ నరకం

ఇరుకు గల్లీల్లో వేలాది బండ్లు...ఉప్పల్ లో మొదలైన ట్రాఫిక్ నరకం
  •     ఎలివేటెడ్ కారిడార్ పనుల కారణంగా డైవర్షన్ ఎఫెక్ట్- 

ఉప్పల్, వెలుగు: ఎలివేటెడ్ కారిడార్ పిల్లర్ల నిర్మాణ పనుల కోసం ఆదివారం నుంచి ఉప్పల్​లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి రావడంతో వాహనదారులకు తిప్పలు మొదలయ్యాయి. ఘట్​కేసర్ మీదుగా ఉప్పల్ వైపు వచ్చే వాహనాలను మెహిఫిల్ హోటల్ పక్కన భగాయత్ లేఅవుట్ ద్వారా నాగోల్ వైపు, అలాగే హబ్సిగూడ నుంచి ఘట్​కేసర్ వైపు వెళ్లే వాహనాలను సర్వే ఆఫ్ ఇండియా ఎదురుగా ఉన్న ఇందిరాగాంధీ పార్క్, లిటిల్ ఫ్లవర్, మండే మార్కెట్ మీదుగా మెయిన్ రోడ్డుకు వెళ్లేలా అధికారులు డైవర్షన్లు చేపట్టారు. 

అయితే, ఈ ప్రత్యామ్నాయ రోడ్లు అత్యంత ఇరుకైనవి కావడంతో ఉదయం, సాయంత్రం పీక్ అవర్స్​లో కిలోమీటర్ల మేర వాహనాలు క్యూ కట్టి ట్రాఫిక్ స్తంభించిపోయింది. సెలవు రోజైన ఆదివారమే పరిస్థితి ఇలా ఉంటే, ఇక సాధారణ పని దినాల్లో (వర్కింగ్ డేస్) రద్దీ ఎలా ఉంటుందోనని ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.  మెయిన్ రోడ్డుపై వెళ్లాల్సిన వాహనాలతో పాటు గల్లీ రోడ్లు కూడా కిక్కిరిసిపోతుండటంతో, ట్రాఫిక్ పోలీసులు అన్ని గల్లీల్లోనూ సిబ్బందిని నియమించి రాకపోకలు సాఫీగా సాగేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.