AUS vs WI:11 ఓవర్లలో 7 వికెట్లు.. గాయంతోనే విండీస్‌ను గెలిపించిన షమర్ జోసెఫ్ 

AUS vs WI:11 ఓవర్లలో 7 వికెట్లు.. గాయంతోనే విండీస్‌ను గెలిపించిన షమర్ జోసెఫ్ 

షమర్ జోసెఫ్..వెస్టిండీస్ కు చెందిన ఒక సాధారణ పేస్ బౌలర్. ఆసీస్ పై తొలి టెస్టు ప్లేయింగ్ 11 లో ఇతని పేరు ప్రకటించగానే బౌలర్లు ఎవరూ లేక ఆడిస్తున్నారనుకున్నారు. నెంబర్ 11 లో బ్యాటింగ్ కి వచ్చినప్పుడు 5 నిమిషాల క్రీజ్ లో ఉంటే గొప్పే అనుకున్నారు. బౌలింగ్ వచ్చినప్పుడూ వికెట్ తీయడమే గగనం అనుకున్నారు.తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ లో 41 బంతుల్లో 36 పరుగులు చేసి విండీస్ పరువు కాపాడాడు. ఇది గాలివాటమే అయినా ఆ తర్వాత అసలైన సీన్ జరిగింది. ఆస్ట్రేలియా టాప్ బ్యాటర్లు స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్ లను ఔట్ చేసి అందరి దృష్టిని తన వైపుకు తిప్పకున్నాడు. 

షమర్ జోసెఫ్ బాగా ఆడినా అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో వెస్టిండీస్ ఓడిపోయింది. అయితే తాజాగా గబ్బాలో జరిగిన రెండో టెస్టులో ఈ యువ పేసర్ ఆసీస్ వెన్ను విరిచి వెస్టిండీస్ కు ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు. మూడో రోజు ఆటలో భాగంగా స్టార్క్ వేసిన పదునైన యార్కర్ కు షమర్ గాయపడ్డాడు. దీంతో బ్యాటింగ్ చేయలేక మైదానాన్ని వీడాడు. నాలుగో రోజు బౌలింగ్ కు వస్తాడో రాదో తెలియని పరిస్థితి. అసలే స్వల్ప లక్ష్యం. దీనికి తోడు ఈ విండీస్ పేసర్ కు గాయం. దీంతో ఆస్ట్రేలియా విజయం నల్లేరు మీద నడకే అనుకున్నారు. 

షమర్ జోసెఫ్ రాకతో మొత్తం సీన్ మారిపోయింది. 216 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో ఆసీస్ కు చుక్కలు చూపించాడు. 7 వికెట్లు తీసుకొని విండీస్ కు అద్భుతమైన విజయాన్ని అందించాడు. నాలుగో రోజు ఆటలో మొత్తం 8 వికెట్లు పడగా..కేవలం 11 ఓవర్లలోనే షమర్7 వికెట్లు పడగొట్టాడు. గాయాన్ని సైతం లెక్క చేయకుండా బౌలింగ్ చేసిన ఈ విండీస్ పేసర్ పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంది.               

బ్రిస్బేన్‌లోని గబ్బా వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో విండీస్.. 8 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. 216 పరుగుల లక్ష్య ఛేదనలో ఆసీస్ 207 పరుగులకు ఆలౌటైంది. ఈ గెలుపుతో పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఓడించిన తొలి జట్టుగా విండీస్ అవతరించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ షమర్ జోసెఫ్ కు లభించింది.