మహిళల్లో అలసట, కడుపు ఉబ్బరమా.? మీరు తినే ఫుడ్ లో ఇవి లోపించకుండా చూసుకోండి

మహిళల్లో అలసట, కడుపు ఉబ్బరమా.?  మీరు తినే ఫుడ్ లో  ఇవి లోపించకుండా చూసుకోండి

మహిళల్లో అలసట, నీరసం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తరచుగా కనిపిస్తుంటాయి. రాత్రిళ్లు సరిగ్గా నిద్రపోకపోవడం, ఒత్తిడి, అధిక పని, వయసు పెరగడం వంటి కారణాల వల్లే ఈ సమస్యలు వస్తున్నాయని చాలామంది భావిస్తుంటారు. అయితే ఈ లక్షణాలు తరచుగా కనిపిస్తూ రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంటే మాత్రం ఆహారపు అలవాట్లపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

 ప్రముఖ న్యూట్రిషనిస్ట్  చెప్ప్పిన వివరాల ప్రకారం.. మహిళలు తమ ఆరోగ్య పరిస్థితిని అర్థం చేసుకునే క్రమంలో ఆహారం అనేది తరచుగా నిర్లక్ష్యానికి గురయ్యే అంశం. అయితే అలసట, కడుపు ఉబ్బరం వంటి ప్రతి సమస్యకు పోషకాహార లోపమే కారణమని భావించకూడదని ఆమె సూచిస్తున్నారు.

ఆహారపు అలవాట్లను గమనించాలి

శరీరంలో శక్తి స్థాయులు, మొత్తం ఆరోగ్యం అనేవి నిద్ర, ఒత్తిడి, హార్మోన్లు, శారీరక శ్రమ, జీర్ణక్రియతో పాటు ఆహారంపై కూడా ఆధారపడి ఉంటాయి. కానీ బిజీ లైఫ్‌స్టైల్‌లో చాలామంది మహిళలు తమ ఆహారంపై తగినంత శ్రద్ధ పెట్టడం లేదు.ఉదయం కాఫీతో రోజును ప్రారంభించి అల్పాహారం మానేయడం.. మధ్యాహ్న భోజనాన్ని హడావుడిగా ముగించడం.. సాయంత్రం అలసటగా అనిపించినప్పుడు టీ, కాఫీ లేదా తీపి పదార్థాలపై ఆధారపడటం వంటివి సాధారణంగా మారిపోయాయి. రోజంతా ఏదో ఒకటి తింటున్నప్పటికీ.. ఆ ఆహారంలో శరీరానికి అవసరమైన ప్రోటీన్, ఫైబర్, ఐరన్ వంటి ముఖ్యమైన పోషకాలు తగినంతగా లేకపోవచ్చు.

అందుకే తరచుగా భోజనం మానేస్తున్నారా? అల్పాహారం, మధ్యాహ్న భోజనంలో ప్రోటీన్ ఉంటుందా? తగినంత పండ్లు, కూరగాయలు తీసుకుంటున్నారా? రోజుకు సరిపడా నీరు తాగుతున్నారా? నీరసం వచ్చినప్పుడు టీ, కాఫీలపైనే ఆధారపడుతున్నారా? వంటి ప్రశ్నలను మనకు మనమే వేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

కడుపు ఉబ్బరానికి కారణం ఏంటి?

కడుపు ఉబ్బరం కూడా చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య. అయితే దీనికి కారణం తెలుసుకోకుండా గ్లూటెన్, పాల ఉత్పత్తులు లేదా కార్బోహైడ్రేట్లను పూర్తిగా ఆహారం నుంచి తొలగించడం సరైన పద్ధతి కాదని నిపుణులు చెబుతున్నారు.

కడుపు ఉబ్బరం ఎప్పుడు వస్తోంది? అంతకుముందు ఏం తిన్నారు? ఎంత పరిమాణంలో తిన్నారు? ఎంత వేగంగా భోజనం చేశారు? వంటి వివరాలను కొన్ని వారాల పాటు డైరీలో నమోదు చేసుకోవడం ద్వారా సమస్యకు సంబంధించిన నమూనాలను గుర్తించవచ్చు.

కొన్ని సందర్భాల్లో కడుపు ఉబ్బరానికి ఒక నిర్దిష్ట ఆహారం కారణం కాకపోవచ్చు. తినే విధానం, భోజనం చేసే సమయం, ఆహారం తీసుకునే పరిమాణం వంటి అంశాలు కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.

మహిళలకు ఐరన్ ఎందుకు ముఖ్యం?

మహిళలు ముఖ్యంగా రుతుస్రావం సమయంలో ఐరన్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. నెలసరి సమయంలో రక్తస్రావం కారణంగా శరీరంలో ఐరన్ అవసరం పెరుగుతుంది. అధికంగా లేదా ఎక్కువ రోజుల పాటు రుతుస్రావం జరిగే మహిళల్లో ఐరన్ నిల్వలు తగ్గే అవకాశం ఉంటుంది.

పప్పులు, బీన్స్, ఆకుకూరలు, గింజలు వంటి ఐరన్ అధికంగా ఉండే ఆహారాలను రోజువారీ భోజనంలో చేర్చుకోవచ్చు. మొక్కల ఆధారిత ఐరన్ వనరులతో పాటు నిమ్మకాయ, టమోటా, ఉసిరి, జామ వంటి విటమిన్-సి అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం కూడా ఉపయోగకరంగా ఉంటుంది.

ప్రోటీన్ కూడా అవసరమే

ప్రోటీన్ అనేది కేవలం వ్యాయామాలు చేసే వారికి మాత్రమే అవసరమయ్యే పోషకం కాదు. మహిళల సమతుల్య ఆహారంలోనూ దీనికి తగిన స్థానం ఉండాలి. వ్యక్తిగత ఆహారపు అలవాట్లను బట్టి గుడ్లు, పాల ఉత్పత్తులు, పనీర్, పప్పుధాన్యాలు, చేపలు వంటి వాటిని ప్రోటీన్ వనరులుగా తీసుకోవచ్చు.

సప్లిమెంట్లను సొంతంగా వాడొద్దు

అలసట, నీరసం లేదా ఇతర ఆరోగ్య సమస్యలు కనిపించిన వెంటనే సప్లిమెంట్లను తీసుకోవడం సరైన పరిష్కారం కాదని నిపుణులు సూచిస్తున్నారు. ముందుగా సమస్యకు అసలు కారణాన్ని గుర్తించడం ముఖ్యం.

అలసట, నీరసం, కడుపు ఉబ్బరం వంటి లక్షణాలు నిరంతరంగా కొనసాగినా, తీవ్రంగా ఉన్నా లేదా ఎలాంటి కారణం లేకుండా పదేపదే కనిపించినా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది. అవసరమైతే వైద్యులు తగిన పరీక్షలు సూచించవచ్చు.

మొత్తంగా.. ప్రతి ఆరోగ్య సమస్యకు ఆహారమే కారణమని భావించకుండా, అదే సమయంలో ఆహారపు అలవాట్లను కూడా నిర్లక్ష్యం చేయకుండా ఉండటం ముఖ్యం. మంచి నిద్ర, ఒత్తిడి నియంత్రణ, తగినంత శారీరక శ్రమతో పాటు సమతుల్య ఆహారాన్ని అలవాటు చేసుకోవడం ఆరోగ్యకరమైన జీవనశైలికి దోహదపడుతుంది.

గమనిక: ఈ కథనంలోని సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. దీనిని వృత్తిపరమైన వైద్య సలహాగా పరిగణించరాదు. నిరంతర లేదా తీవ్రమైన లక్షణాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించాలి.