పశువుల ‘పాణం’ పిండుతున్రు...గండిపేటలో ఎక్కువ పాలు రావడానికి నిషేధిత ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ల దందా.. ఒకరి అరెస్ట్

పశువుల ‘పాణం’ పిండుతున్రు...గండిపేటలో ఎక్కువ పాలు రావడానికి నిషేధిత ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ల దందా.. ఒకరి అరెస్ట్

గండిపేట, వెలుగు:  నిషేధిత ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లను విక్రయిస్తున్న ఓ డెయిరీ ఫారమ్ యజమానిని శంషాబాద్ జోన్ టాస్స్​ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ.50 వేల విలువైన 173 ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ బాటిళ్లను (43.250 లీటర్లు) స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. మంఖాల్ గ్రామానికి చెందిన అత్తేని కృష్ణ (45) కుటుంబంతో కలిసి డెయిరీ ఫారమ్ నడుపుతున్నాడు. అలాగే తుక్కుగూడలో శ్రీకృష్ణ క్యాటిల్ ఫీడ్ పేరుతో పశుగ్రాసం దుకాణాన్ని ఏర్పాటు చేశాడు. 

ఈ క్రమంలో 5-6 ఏండ్ల క్రితం గుజరాత్ నుంచి నిషేధిత ఇంజెక్షన్లను సరఫరా చేసే ఖాలెద్ ఆలీ అలియాస్ చత్రుసింగ్​తో ఇతనికి పరిచయం ఏర్పడింది. ఖాలెద్ ఆలీ గుజరాత్ నుంచి ఈ ఇంజెక్షన్లను తెప్పించి కృష్ణకు కేవలం రూ.50కే సరఫరా చేసేవాడు. ఇందులో భారీ లాభాలు ఉండటాన్ని గమనించిన కృష్ణ.. ఆ బాటిళ్లను స్థానిక డెయిరీ ఫారమ్ నిర్వాహకులకు రూ.250 నుంచి రూ.300 వరకు విక్రయిస్తూ అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నాడు. 

డెయిరీ నిర్వాహకులు గేదెలు, ఆవుల నుంచి బలవంతంగా ఎక్కువ పాలు పిండడానికి ఈ ప్రమాదకర ఇంజెక్షన్లను వాడుతున్నారు. పక్కా సమాచారంతో శంషాబాద్ టాస్స్​ఫోర్స్ బృందం దాడి చేసి అత్తేని కృష్ణను పట్టుకుని ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకుంది. తదుపరి చర్యల నిమిత్తం నిందితుడిని పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్​కు అప్పగించి రిమాండ్​కు తరలించారు. ఈ కేసులో ప్రధాన సరఫరాదారు ఖాలెద్ ఆలీతో పాటు, కృష్ణ వద్ద క్రమం తప్పకుండా ఇంజెక్షన్లు కొనుగోలు చేసే తుక్కుగూడకు చెందిన సురేశ్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.