గురుగ్రామ్‌లో పెంపుడు జంతువుల పెళ్లి చేసిన యజమానులు

గురుగ్రామ్‌లో పెంపుడు జంతువుల పెళ్లి చేసిన యజమానులు

పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయన్నది ఎంత వరకు నిజమో తెలియదు గానీ.. తమ పెంపుడు జంతువులకు పెళ్లి చేసి, అభిమానాన్ని చాటుకున్నారు యజమానులు. హర్యానాలోని గురుగ్రామ్ పాలమ్ విహార్ లో నివసించే ప్రజలు తమ చుట్టుపక్కన ఉండే కుక్కలకు పెళ్లి చేశారు. 100 ఆహ్వాన పత్రికలను ప్రింట్ చేయించి, స్థానికులకు పంచిపెట్టారు. షేరు (మగ), స్వీటీ (ఆడ) కుక్కల పెళ్లిని చూసేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. 

పెళ్లయిన తర్వాత తమకు పిల్లలు కలగలేదని, ఆ ఒంటరితనాన్ని అధిగమించేందుకు తన భర్త మూడేళ్ల క్రితం స్వీటీని గుడి దగ్గర నుంచి తీసుకువచ్చాడని ఆడ కుక్కను పెంచిన రాణి అనే మహిళ తెలిపింది. అప్పటి నుంచి స్వీటీని తన సొంత బిడ్డలాగే చూసుకున్నానని చెప్పింది. ఈ పెళ్లి కారణంగా తనకు కన్యాదానం చేసే అవకాశం వచ్చిందని అన్నారు. ఇక షేరును పెంచిన కుటుంబం సైతం ఆనందం వ్యక్తం చేసింది. తమ పిల్లలు కూడా షేరుతో ఆడుకుంటూ పెరిగారని ఆ కుటుంబం తెలిపింది.