నాకు తెలియకుండానే నా గర్భాశయం తీసేశారు.. ఉదిత్ నారాయణ్‌పై మొదటి భార్య రంజన ఫిర్యాదు.

నాకు తెలియకుండానే నా గర్భాశయం తీసేశారు.. ఉదిత్ నారాయణ్‌పై మొదటి భార్య రంజన ఫిర్యాదు.

ప్రముఖ బాలీవుడ్ గాయకుడు ఉదిత్ నారాయణ్ మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. ఆయన మొదటి భార్య రంజనా నారాయణ్ ఝా ( 61 ) చేసిన షాకింగ్ ఆరోపణలు సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. దశాబ్దాల క్రితం తనకు తెలియకుండా తన అనుమతి లేకుండా తన గర్భాశయాన్ని తొలగించారంటూ ఆమె పోలీసులను ఆశ్రయించడం ఇప్పుడు సంచలన సృష్టిస్తుంది. 

గర్భాశయం తొలగింపు!

బీహార్‌లోని సుపాల్ జిల్లా మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిబ్రవరి 10న రంజన నార ఫిర్యాదు చేశారు. తన ఫిర్యాదులో 1996లో ఉదిత్ నారాయణ్, ఆయన సోదరులు సంజయ్ కుమార్ ఝా, లలిత్ నారాయణ్ ఝా, ప్రస్తుత భార్య దీపా నారాయణ్ కలిసి తనను చికిత్స నిమిత్తం ఢిల్లీలోని ఒక పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్లారని ఆమె తెలిపారు. అక్కడ అసలు ఏ చికిత్స చేస్తున్నారో చెప్పకుండానే ఆపరేషన్ చేశారని, అయితే సంవత్సరాల తర్వాత వేరే అనారోగ్య సమస్యతో డాక్టర్లను సంప్రదించినప్పుడు.. తన గర్భాశయం తొలగించబడినట్లు తెలిసి షాక్ అయ్యానని రంజన వాపోయారు. ఇది తనను సంతానానికి దూరం చేసేందుకు జరిగిన ఒక నేరపూరిత కుట్ర అని ఆమె ఆరోపించారు.

మూడు దశాబ్దాల మోసం 

1984 డిసెంబర్ 7న హిందూ సంప్రదాయం ప్రకారం ఉదిత్ నారాయణ్‌తో ఆమె వివాహం జరిగింది. ఆ తర్వాత 1985లో ఆయన ముంబై వెళ్లారు. అక్కడ దీపాతో వివాహం జరిగిన విషయం మీడియా ద్వారా తెలిసి నిలదీయగా.. ఉదిత్ తనను పదేపదే తప్పుదోవ పట్టించారని రంజన పేర్కొన్నారు. ఇన్నాళ్లు ఒపికగా ఉన్నా.. ఫలితం లేదు.  అందుకే న్యాయం కోసం మహిళా పోలీస్ స్టేషన్‌కు వచ్చాను" అని రంజన ఆవేదన వ్యక్తం చేశారు. గడిచిన కొన్నేళ్లుగా తాను తీవ్ర నిర్లక్ష్యానికి, వేధింపులకు గురయ్యానని రంజన తెలిపారు. ముంబై వెళ్లినా, నేపాల్‌లోని అత్తగారి ఇంటికి వెళ్లినా తనను లోపలికి రానివ్వకుండా అవమానించారని ఆమె ఆరోపించారు.

పోలీసుల దర్యాప్తు

పోలీసు అధికారులు ఆమె ఫిర్యాదును స్వీకరించి దర్యాప్తు ప్రారంభించారు. అయితే, రంజన ఆరోపిస్తున్న ఘటనలు దాదాపు 30 ఏళ్ల క్రితం (1996) నాటివి కావడంతో సాక్ష్యాధారాల సేకరణ పోలీసులకు సవాలుగా మారింది. ప్రాథమిక విచారణ తర్వాత ఎఫ్.ఐ.ఆర్ (FIR) నమోదు చేస్తామని అధికారులు వెల్లడించారు. ఒకప్పటి స్టార్ సింగర్ ఉదిత్ నారాయణ్ వ్యక్తిగత జీవితం మరోసారి రచ్చకెక్కడం హాట్ టాపిక్ గా మారింది.. గతంలోనూ రంజన తన భార్య అని ఉదిత్ నిరాకరించగా, ఆమె కోర్టుకెక్కి తన వాదనను నిరూపించుకున్నారు. ఇప్పుడు ఏకంగా 'మెడికల్ క్రైమ్' ఆరోపణలు రావడంతో ఈ వివాదం ఎటు దారితీస్తుందో చూడాలి..