బెంగాలీ సినీ, టెలివిజన్ రంగాల్లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు రాహుల్ అరుణోదయ్ బెనర్జీ (43) మృతి చెందారు. ఆదివారం (2026 మార్చి 29న) ఒడిశాలోని తల్సరి బీచ్ వద్ద 'భోలే బాబా పార్ కరేగా' సీరియల్ షూటింగ్ లో జరిగిన ఒక ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం బెంగాలీ సినీ రంగాన్ని తీవ్ర విషాదంలో ముంచింది.
2008లో ‘చిరోదిని తుమీ జే అమర్’మూవీతో గుర్తింపు పొందిన రాహుల్, నటుడిగానే కాక దర్శకుడిగానూ పేరు సంపాదించారు. ఈ మూవీలో హీరోయిన్ గా నటించిన ప్రియాంక సర్కార్ ని రాహుల్ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు ఉన్నారు.
భర్త మరణంపై ప్రియాంక సర్కార్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేసింది. “ఈ విషాదకర సమయంలో తమ కుటుంబానికి గోప్యత ఇవ్వాలని, మీడియా జోక్యం లేకుండా ఉండాలని” విజ్ఞప్తి చేశారు.
ప్రమాదం ఎలా జరిగింది:
కో-స్టార్ శ్వేతా మిశ్రాతో కలిసి రాహుల్ మోకాళ్ల లోతు నీటిలో ఒక సీరియల్ సన్నివేశం కోసం డ్యాన్స్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆ సమయంలో ఇద్దరూ అకస్మాత్తుగా నీటిలో ఉన్న లోతైన గుంతలో పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన యూనిట్ సభ్యులు వారిని బయటకు తీసి హుటాహుటిన దిఘా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో శ్వేతా మిశ్రా ప్రాణాలతో బయటపడగా, రాహుల్‌ను వైద్యులు మృతుడిగా ప్రకటించారు.
పోలీసుల ప్రకారం, ఈ షూటింగ్‌కు ముందస్తు సమాచారం లేదా అనుమతి తీసుకోలేదని తెలుస్తోంది. ఈ ఘటనపై తల్సరి బీచ్ పరిధిలోని పోలీసులు, దిఘా పోలీసులతో కలిసి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.కేసుపై పూర్తి స్థాయి విచారణ కొనసాగుతోంది. రాహుల్ మృతదేహానికి సోమవారం (మార్చి 30) కాంతి సబ్-డివిజనల్ ఆసుపత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించనున్నారు. నివేదిక ఆధారంగా మరణానికి ఖచ్చితమైన కారణం వెల్లడించనున్నారు.
ఈ ఘటనపై సీరియల్ డైరెక్టర్ సుభాషిస్ మోండల్ మాట్లాడుతూ.. “షూటింగ్ అయిపోగానే చాలామంది యూనిట్ సభ్యులు వెళ్లిపోయారు. కానీ రాహుల్ మాత్రం అదనంగా డ్రోన్ షాట్ తీయాలని పట్టుబట్టారు. ఈ క్రమంలోనే రాహుల్ తన కో స్టార్ శ్వేతా మిశ్రాతో కలిసి మోకాల్లోతు నీళ్లలో నిలబడి ఒక సీన్ కోసం డ్యాన్స్ చేస్తున్నాడు. ఆ సమయంలో అలలు తగలడంతో శ్వేత అసౌకర్యంగా భావించి అక్కడి నుండి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది.
రాహుల్ మాత్రం కెమెరా వైపు ముఖం పెట్టి రెండో టేక్ తీయాలని కోరుకుని నీటిలోకి మరింత లోతుకు వెళ్లారు. ఆ వెంటనే ఆయన్ని గమనించిన యూనిట్ టీమ్ మొత్తం.. నీటిలోంచి బయటకు రమ్మని వేడుకుంది, కానీ ఆయన వినలేదని చెప్పారు. ఇక నీళ్ళు మింగేసే లోపే అతన్ని రక్షించడానికి దూకి బయటకి తీసాం. అతన్ని హుటాహుటిన బయటకి తీసి ఆసుపత్రికి చేరుకునేసరికే ఆయన మరణించినట్లుగా వైద్యులు ప్రకటించారని” డైరెక్టర్ సుభాషిస్ చెప్పారు.
విచారం వ్యక్తం చేసిన సీఎం:
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. “ఇది బెంగాలీ సినీ రంగానికి తీరని నష్టం” అని పేర్కొన్నారు. దర్శకుడు రాజ్ “అతనిలో అపారమైన ప్రతిభ ఉంది” అంటూ సంతాపం తెలిపారు.
