వరల్డ్ ఛాంపియన్ షిప్లో మిశ్రమ ఫలితాలు

వరల్డ్ ఛాంపియన్ షిప్లో మిశ్రమ ఫలితాలు

వరల్డ్ చాంపియన్‌షిప్‌లో ఇండియా స్టార్ షట్లర్ హెచ్‌.ఎస్ ప్రణయ్  క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లాడు. మెన్స్ సింగిల్స్ రెండో రౌండ్‌లో వరల్డ్ ఫార్మర్ నెంబర్‌వన్‌  రెండో ర్యాంకర్ కెంటో మొమోటాను ఓడించిన ప్రణయ్... ప్రీ క్వార్టర్స్‌లో భారత్ కే చెందిన ఆటగాడిపై విజయం సాధించాడు. కామన్వెల్త్ గోల్డ్ మెడలిస్ట్ లక్ష్యసేన్‌పై 17-21, 21-16, 21-17 స్కోరు తేడాతో గెలుపొందాడు. ఫస్ట్ గేమ్లో ఓడినా..ఆ తర్వాత రెండు గేముల్లో విజృంభించి మ్యాచ్ను సొంతం చేసుకున్నాడు. 

సైనా నిష్క్రమణ..


ఉమెన్స్ సింగిల్స్లో సైనా నెహ్వాల్ ఓడిపోయింది.  రెండో రౌండ్లో  ప్రపంచ మాజీ ఛాంపియన్‌ జపాన్ ప్లేయర్ నొజొమి ఒకుహర  వాకోవర్ ఇవ్వడంతో మూడో రౌండ్కు చేరుకున్న సైనా..ప్రీ క్వార్టర్లో  ఓటమిపాలైంది. గంటా నాలుగు నిమిషాల పాటు సాగిన  మ్యాచ్‌లో  సైనా 17-21, 21-16, 13-21 తేడాతో 12వ సీడ్‌ థాయిలాండ్ ప్లేయర్ బుసానన్‌ ఓంగారుంగ్‌ఫాన్‌పై  పోరాడి ఓడింది. మొదటి గేమ్‌ను 17-21తో కోల్పోయిన సైనా..రెండో గేమ్లో పుంజుకుని 21-16తో దక్కించుకుంది. మూడో గేమ్‌లో తిరిగి ఆధిక్యంలోకి వచ్చిన బుసానన్‌ 21-13తో సైనాను ఓడించింది. దీంతో క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది.

కిదాంబి విఫలం..


వరల్డ్ ఛాంపియన్ షిప్ 2021 రన్నరప్ కిదాంబి శ్రీకాంత్ ఈ సారి విఫలయ్యాడు. 12వ సీడ్‌ శ్రీకాంత్‌ 18-21,17-21తో చైనాకు చెందిన 32వ ర్యాంకర్‌ జావో జున్‌ పెంగ్‌ చేతిలో ఓడిపోయాడు. ప్రత్యర్థి షాట్లకు సమాధానం చెప్పలేక..కేవలం  34 నిమిషాల్లోనే మ్యాచ్ ను అప్పగించాడు 

డబుల్స్లో విజయాలు..
మెన్స్ డబుల్స్‌లో భారత జోడి ఎంఆర్ అర్జున్- ధృవ్ కపిల్ జోడి క్వార్టర్ కు దూసుకెళ్లింది. ప్రిక్వార్టర్స్‌లో ధృవ్-అర్జున్ జంట 18-21, 21-15, 21-16 తేడాతో సింగపూర్‌కు చెందిన కేహెచ్ లోహ్-హెచ్ టెర్రీ జోడీని ఓడించింది.  

అటు మరో మ్యాచ్ లో  సాత్విక్ సాయిరాజ్ రాంకీ రెడ్డి -చిరాగ్ శెట్టిలు కూడా క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లారు. ప్రిక్వార్టర్స్‌లో కామన్వెల్త్ గోల్డ్ మెడల్ గెలిచిన ఈ జంట...21-12, 21-10 తేడాతో డేన్కార్క్ జోడి  జెప్పీ బే- లాస్సే మోల్హెడేపై గెలుపొందారు. క్వార్టర్స్‌లో వీరిద్దరు డిఫెండింగ్ ఛాంపియన్లు జపాన్ జోడి టకురో హోకి-యుగో కొబయాషితో తలపడబోతున్నారు.