సిక్కింలో టన్నెల్ ప్రమాదం 11 మంది మృతి.. మిథేన్ గ్యాస్ పేలడంతో విరిగిపడ్డ కొండచరియలు

సిక్కింలో టన్నెల్ ప్రమాదం 11 మంది మృతి.. మిథేన్ గ్యాస్ పేలడంతో విరిగిపడ్డ కొండచరియలు
  • ఇంకా లోపల్నే మరో 25 మంది కార్మికులు
  • మిథేన్ గ్యాస్ పేలడంతో విరిగిపడ్డ కొండచరియలు
  • పేలుడు ధాటికి మూసుకుపోయిన ప్రవేశ ద్వారం

గాంగ్‌‌‌‌‌‌‌‌టక్: సిక్కింలో జలవిద్యుత్ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న ఓ టన్నెల్ లో పేలుడు సంభవించింది. దీంతో కొండచరియలు విరిగిపడి టన్నెల్ ప్రవేశ ద్వారం మూసుకుపోయింది. సోమవారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదంలో 11 మంది కార్మికులు మృత్యువాత పడ్డారు. మరో 25 మందికి పైగా కార్మికులు లోపల చిక్కుకున్నారని అధికారవర్గాలు తెలిపాయి. వారిని కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 

మ్‌‌‌‌‌‌‌‌చి జిల్లా సమర్‌‌‌‌‌‌‌‌డుంగ్ వద్ద నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌పీసీ) ఆధ్వర్యంలో తీస్తా స్టేజ్ VI హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్ట్(జలవిద్యుత్ ప్రాజెక్ట్) నిర్మిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం హెడ్ రేస్ టన్నెల్‌‌‌‌‌‌‌‌లో కార్మికులు, ప్రాజెక్ట్ అధికారులు పనిచేస్తుండగా ఉన్నట్టుండి భారీ పేలుడు సంభవించింది. 

భూగర్భంలో రాళ్ల మధ్యనున్న మిథేన్ గ్యాస్ ఒక్కసారిగా పేలింది. దాంతో  కొండచరియలు విరిగిపడి టన్నెల్ ప్రవేశ ద్వారం పూర్తిగా మూసుకుపోయింది. వెంటనే టన్నెల్ లోపల దట్టమైన పొగ, విషవాయువులు నిండిపోయాయి. ప్రమాద సమాచారం అందగానే స్థానిక పోలీసులు, ఫైర్ సిబ్బంది, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్), స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్డీఆర్ఎఫ్), ఇతర స్థానిక అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. టన్నెల్‌‌‌‌‌‌‌‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన రెస్క్యూ సిబ్బందికి మిథేన్ గ్యాస్ వల్ల తల తిరగడం, స్పృహ తప్పడం వంటి సమస్యలు ఎదురయ్యాయి. 

సాధారణ పరికరాలతో టన్నెల్‌‌‌‌‌‌‌‌ లోపలికి వెళ్లడం అసాధ్యమని గుర్తించి సహాయక చర్యలను కాసేపు నిలిపివేశారు. వెంటనే బెంగాల్ నుంచి ప్రత్యేక మైనింగ్ రెస్క్యూ టీమ్‌‌‌‌‌‌‌‌ను రప్పించారు. ఎన్‌‌‌‌‌‌‌‌డీఆర్‌‌‌‌‌‌‌‌ఎఫ్, ఎస్‌‌‌‌‌‌‌‌డీఆర్‌‌‌‌‌‌‌‌ఎఫ్ సిబ్బంది ప్రత్యేక గ్యాస్ మాస్క్‌‌‌‌‌‌‌‌లు, ఆక్సిజన్ సిలిండర్లు ధరించి తిరిగి టన్నెల్ లోపలికి వెళ్లి రెస్క్యూ ఆపరేషన్‌‌‌‌‌‌‌‌ను ముమ్మరం చేశారు. టన్నెల్ బయట పలు అంబులెన్సులను సిద్ధంగా ఉంచి, బయటకు తీసిన బాధితులను వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.

 మృతదేహాలను వెలికి తీసి పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రమాద వార్త తెలుసుకున్న బాధితుల కుటుంబసభ్యులు, తోటి కార్మికులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రుల వద్దకు చేరుకోవడంతో అక్కడ తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. కాగా, ప్రమాద ఘటనపై సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయం స్వయంగా ప్రమాద స్థలానికి చేరుకునిపరిస్థితిని సమీక్షించారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల ఎక్స్‌‌‌‌‌‌‌‌గ్రేషియా, గాయపడిన వారికి రూ.50,000 తక్షణ ఆర్థిక సాయం ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు.