హైదరాబాద్/ముషీరాబాద్, వెలుగు : చిక్కడపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కలకలం రేపిన వెండి కిరీటం మాయం ఉదంతం ఎట్టకేలకు సుఖాంతమైనప్పటికీ, పలు అనుమానాలు మాత్రం ఇంకా మిగిలే ఉన్నాయి. గతంలో దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు జరిపిన ఆకస్మిక తనిఖీల్లో ఓ భక్తుడు ఇచ్చిన రెండున్నర కిలోల వెండి కిరీటం కనిపించకపోవడం, రసీదు కూడా లేకపోవడంతో ఈవో రామాంజనేయులు పై సస్పెన్షన్ వేటు వేశారు.
అయితే, గురువారం సదరు భక్తుడు స్వయంగా ఆ వెండి కిరీటాన్ని అధికారులకు అందజేశాడు కాగా, అసలు కిరీటం ఇన్ని రోజులు ఎవరి వద్ద ఉంది? సదరు భక్తుడి వద్దకు మళ్లీ ఎలా వెళ్లింది? ఇప్పుడు అప్పగించిన కిరీటం బరువు గతంలో ఇచ్చిన దానితో సరితూగుతుందా? లేదా అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ కీలక విషయాలపై వివరణ కోరేందుకు ప్రయత్నించగా, అధికారులు అందుబాటులోకి రాలేదు.
