హోం క్వారంటైన్ భయం: తుంగభద్రలో శవమైన సింధూరెడ్డి

హోం క్వారంటైన్ భయం: తుంగభద్రలో శవమైన సింధూరెడ్డి

శనివారం తెల్లవారుజామున.. జోగులాంబ గద్వాల జిల్లాలోని కలుగొట్ల గ్రామంలోని వాగులో సింధూ రెడ్డి(28) ప్రమాదవశాత్తూ గల్లంతయ్యారు. పోలీసులు, రెస్క్యూ టీమ్ అంచనా వేసినట్లుగానే.. వాగుకు సమీపంలోని తుంగభద్ర నదిలోకి ఆమె కొట్టుకుపోయారు. కర్నూలులోని తుంగభద్ర బ్రిడ్జి  దగ్గర ఇవాళ(సోమ‌వారం) ఆమె మృత‌దేహం ల‌భ్య‌మైంది. ప్రమాదం నుంచి సింధు భర్త శివశంకర్ రెడ్డి, అతని స్నేహితుడు జిలానీ బాషా ప్రాణాలతో బయటపడినా, ఆమెను కాపాడేందుకు రెస్క్యూ సిబ్బంది, గజ ఈతగాళ్లు చేసిన ప్రయత్నం విఫలమైంది.

హైదరాబాద్ కు చెందిన శివశంకర్ రెడ్డి, కడప జిల్లా పులివెందుల చెందిన నాగసింధూరెడ్డి భార్యా భర్తలు. బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు .సెలవు కావడంతో కారులో బెంగళూరు నుంచి హైదరాబాద్ పయనమయ్యారు.దూరప్రయాణం కావడంతో డ్రైవ్ లో తోడు కోసం శివశంకర్‌రెడ్డి స్నేహితుడు జిలానీబాషా కూడా వారితో తోడుగా వచ్చాడు. తెలంగాణ చెక్ పోస్టు దగ్గర కరోనా టెస్టులు చేసి, హోం క్వారంటైన్ విధిస్తారేమోననే భయంతో హైవేను వదిలి మరో మార్గంలో ప్రయాణించారు. దీంతో ప్రమాదం జరిగింది.

శని, ఆదివారాల్లో పొద్దు పోయేంత వరకు గాలించి, చర్యలను నిలిపేసిన పోలీసులు.. సోమవారం ఉదయం నుంచి మళ్లీ ఆపరేషన్ మొదలు పెట్టారు. వరద ఉధృతి ఇంకా కొనసాగుతుండటం, వాగుకు దగ్గర్లోనే తుంగభద్ర నది ఉండటంతో గాలింపునకు లైఫ్ బోట్లు వాడాలంటూ జిల్లా ఎస్పీ రంజన్ రజత్ కుమార్ ఆదేశించారు.

అలంపూర్‌ నియోజకవర్గం పరిధిలోని ఉండవెల్లి మండలం కలుగొట్ల వాగులో ప్రవాహ ఉద్ధృతిని తప్పుగా అంచనా వేసి, ముందుకు రావడంతో కారు వరదలో కొట్టుకుపోయింది. ఆ సమయంలో వెనుక సీటులో నిద్రపోతోన్న సింధును కాపాడేందుకు శివశంకర్, బాషా చేసిన ప్రయత్నం విఫలమైంది. చివరికి సింధు చనిపోయిందన్న వార్త వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. సింధు గర్భవతి అని ఆమె తండ్రి రామాంజనేయ రెడ్డి మీడియాకు తెలిపారు. ఆమె క్షేమంగా తిరిగి తిరిగిరావాలని కుటుంబీకులు, సన్నిహితులు ప్రార్థనలు చేసినా ఫలించలేదు.