గుండెపోటుతో చనిపోయి ఇద్దరికి చూపునిచ్చిన టీచర్

గుండెపోటుతో చనిపోయి ఇద్దరికి చూపునిచ్చిన టీచర్
  •     ఎన్నికల్లో విధులు నిర్వహించిన మరుసటి రోజే మృతి
  •     నేత్రదానం చేసి గొప్ప మనసు చాటుకున్న కుటుంబసభ్యులు

మంచిర్యాల, వెలుగు: గుండెపోటుతో ఇంటిపెద్ద చనిపోగా పుట్టెడు బాధలోనూ ఆయన కుటుంబసభ్యులు ఉదారత చాటుకున్నారు. ఆయన కండ్లను దానం చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గోపాలవాడ ప్రాంతానికి చెందిన గడిగొప్పుల సదానందం(46) స్థానిక రామకృష్ణాపురంలోని ప్రభుత్వ పాఠశాలలో ఫిజికల్​ డైరెక్టర్​(పీడీ)గా పనిచేస్తున్నారు. సోమవారం జరిగిన ఎన్నికల్లో విధులు నిర్వహించిన సదానందం మంగళవారం ఛాతీలో నొప్పిగా ఉందని అవస్థ పడుతుండడంతో, వెంటనే మంచిర్యాలలోని ఓ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గుండెపోటుతో చనిపోయారు. 

అమెరికాలో ఉంటున్న మృతుని కూతురు, అల్లుడు రావడానికి ఆలస్యం అవుతుండడంతో డెడ్​బాడీని కరీంనగర్​లోని ప్రతిమ మెడికల్ కాలేజీలో భద్రపరిచారు. ఇంటి పెద్దదిక్కును కోల్పోయిన దుఃఖంలోనూ ఆ కుటుంబసభ్యులు ఇద్దరు అంధులకు చూపు ప్రసాదించాలని ముందుకు వచ్చారు. ఎల్వీ ప్రసాద్ ఐ బ్యాంక్ ప్రతినిధి సహకారంతో బుధవారం సదానందం నేత్రాలను సేకరించారు. హైదరాబాద్ లోని ఐ బ్యాంక్​కు తరలించారు. సదానందం నేత్రాలను దానం చేయడానికి అంగీకారం తెలిపిన కుటుంబసభ్యులను సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు టి.శ్రావణ్ కుమార్, గౌరవ అధ్యక్షుడు సానా రామకృష్ణారెడ్డి అభినందించారు.