No Confidence Motion: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై.. అవిశ్వాస తీర్మానానికి టీఎంసీ మద్దతు

No Confidence Motion: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై.. అవిశ్వాస తీర్మానానికి టీఎంసీ మద్దతు

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ నిర్ణయించింది. పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ ఆదేశాల మేరకు టీఎంసీ ఎంపీలు ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మార్చి 9న ప్రారంభం కానున్న రెండో దశపార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ముందు నిర్ణయాన్ని ప్రకటించడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. స్పీకర్‌ను పదవి నుంచి తొలగించాలని ప్రతిపక్ష పార్టీలు లోక్‌సభలో పోరాటానికి సిద్ధమవుతున్న క్రమంలో రానున్న బడ్జెట్ సమావేశాల్లో లోక్‌సభలో చర్చలు వేడెక్కే అవకాశం కనిపిస్తోంది.

ఓం బిర్లాను తొలగించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలు చెందిన మహ్మద్ జావేద్, కోడికున్నిల్ సురేష్, మల్లు రవి అధికారికంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు.  స్పీకర్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని శాసనసభ్యులు ఆరోపించారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ , ఇతర ప్రతిపక్ష నేతలను సభలో మాట్లాడకుండా బిర్లా అడ్డుకున్నారని, ప్రతిపక్ష పార్టీల మహిళా ఎంపీలపై స్పీకర్  అనవసరమైన ఆరోపణలు చేశారని ఆరోపించారు. 

ప్రజా సమస్యలను లేవనెత్తినందుకు ప్రతిపక్ష సభ్యులను పార్లమెంటు సమావేశం మొత్తం సస్పెండ్ చేశారని, అధికార భారతీయ జనతా పార్టీ సభ్యులు మాజీ ప్రధానమంత్రులపై అవమానకరమైన వ్యాఖ్యలు చేసినందుకు మందలించలేదని కాంగ్రెస్ ఎంపీలు వాదించారు. ఈ పరిణామాలతో  రానున్న బడ్జెట్ సమావేశాల్లో లోక్‌సభలో రాజకీయ ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.