T20 World Cup Final: ఈ ముగ్గురు ప్లేయర్స్ రాణిస్తే.. భారత్‌కు ట్రోఫీ పక్కా..!

T20 World Cup Final: ఈ ముగ్గురు ప్లేయర్స్ రాణిస్తే.. భారత్‌కు ట్రోఫీ పక్కా..!

T20 World Cup Final: టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్‌లో భారత్ – న్యూజిలాండ్ జట్లు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రేపు (మార్చి 8న) తలపడబోతున్నాయి. ఈ మెగా టోర్నమెంట్ అంతటా అద్భుత ప్రదర్శన చేసిన ఈ రెండు జట్ల మధ్య జరిగే ఈ తుది పోరుపై అభిమానుల్లో భారీ ఆసక్తి కొనసాగుతుంది. ముఖ్యంగా టీ20 ప్రపంచకప్‌లలో ఇప్పటి వరకు న్యూజిలాండ్‌పై ఇండియా విజయం సాధించకపోవడంతో.. ఈ మ్యాచ్‌ను మరింత ఉత్కంఠభరితంగా మార్చింది. దీంతో భారత్‌కు ట్రోఫీ అందించే అవకాశం ఉన్న ముగ్గురు కీలక ఆటగాళ్లపై ఇప్పుడు అందరి దృష్టి పడింది.  

సంజు శాంసన్: 
ఈ టోర్నమెంట్‌లో సంజు శాంసన్ అద్భుత ఫామ్‌ని ప్రదర్శిస్తున్నాడు. సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై కేవలం 42 బంతుల్లో 89 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆ ప్రదర్శనకు అతడికి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు కూడా లభించింది. ఆసక్తికర విషయం ఏమిటంటే, టోర్నీ ప్రారంభంలో సంజు శాంసన్ జట్టులో భాగం కాదు.. ఇషాన్ కిషన్‌కి బ్యాకప్ వికెట్ కీపర్‌గా మాత్రమే ఉన్నాడు. అయితే రింకూ సింగ్ ప్లేయింగ్ ఎలెవన్ నుంచి తప్పుకోవడంతో శాంసన్‌కు ఛాన్స్ లభించింది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న అతడు వెస్టిండీస్‌పై అజేయంగా 97 పరుగులు చేయగా, ఇంగ్లాండ్‌పై 89 పరుగులు చేసి సత్తా చాటాడు. ఫైనల్‌లో కూడా శాంసన్ గేమ్ చేంజర్‌గా మారే అవకాశం ఉంది.

హార్దిక్ పాండ్యా: 
టీమిండియాలో పూర్తిస్థాయి ఆల్ రౌండర్ గా హార్దిక్ పాండ్యాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. వేగంగా పరుగులు చేయడమే కాకుండా అవసరమైన సమయంలో కీలక వికెట్లు కూడా తీస్తుంటాడు. ఫీల్డింగ్‌లో కూడా అతడు చురుగ్గా ఉంటాడు.  ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌లో పాండ్యా కొన్ని కీలక ఇన్నింగ్స్ ఆడాడు.. ముఖ్యమైన వికెట్లు కూడా తీసుకున్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీఫైనల్‌లో ఫిల్ సాల్ట్ వికెట్ తీసి ప్రత్యర్థి జట్టుకు ప్రారంభంలోనే బిగ్ షాక్ ఇచ్చాడు. వెస్టిండీస్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో షెర్ఫేన్ రూదర్‌ఫోర్డ్‌ను ఔట్ చేసి టీమ్ కి విజయాన్ని అందించాడు. ఈ టోర్నమెంట్‌లో ఇప్పటి వరకు 8 మ్యాచ్‌ల్లో 199 పరుగులు చేయడంతో పాటు 8 వికెట్లు తీశాడు. ఫైనల్‌లో పాండ్యా ప్రదర్శన అత్యంత కీలకం కానుంది.

జస్ప్రీత్ బుమ్రా: 
భారత జట్టుకు అత్యంత నమ్మకమైన బౌలర్‌గా జస్ప్రీత్ బుమ్రా పేరుగాంచాడు. కీలక సమయంలో వికెట్లు తీయగల సామర్థ్యం భారత్‌కు పెద్ద బలం. సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేసి వాళ్లు రన్స్ చేయకుండా కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ టోర్నమెంట్‌లో ఇప్పటి వరకు బుమ్రా 7 మ్యాచ్‌ల్లో 10 వికెట్లు తీసుకున్నాడు. అతని ఎకానమీ రేటు కూడా కేవలం 6.62 మాత్రమే ఉండటం గమనార్హం. కీలక సమయంలో వికెట్ తీసే అబిలిటీ బుమ్రాను అత్యంత ప్రమాదకర బౌలర్‌గా నిలబెట్టింది.