హైదరాబాద్: ఆయుధాలతోనే సమస్యలు పరిష్కారం కావని.. ఎంత పెద్ద సమస్య అయినా చర్చలే పరిష్కారమని సీఎం రేవంత్ అన్నారు. శాంతి మార్గాన్ని మహాత్మ గాంధీ ప్రపంచానికి అందించారని.. శాంతియుతంగా ఓ యుద్ధాన్ని గెలిచిన చరిత్ర మనదని పేర్కొన్నారు. శనివారం (మార్చి 7) సీఎం రేవంత్ రెడ్డి ఎదుట కమాండ్ కంట్రోల్ సెంటర్లో 130 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆయుధాలు వీడాలని నేను గతంలో పిలుపునిచ్చానని.. నా పిలుపు మేరకు మావోయిస్టులు లొంగిపోతున్నారన్నారు.
మిగిలిపోయిన మావోస్టులు కూడా లొంగిపోవాలని కోరుతున్నామని.. అజ్ఞాతంలో ఉన్న వారు జనజీవన స్రవంతిలోకి రావాలని కోరారు. 130 మంది మావోల లొంగుబాటలో అధికారుల పాత్ర కీలకమని.. ప్రాణ హాని లేకుండా పోలీసులు భద్రత కల్పించారని పేర్కొన్నారు. నక్సలైట్లకు నమ్మకం కల్పించింది పోలీసులేనని చెప్పారు. ఇటీవల లొంగిపోయిన మావోయిస్ట్ పార్టీ అగ్రనేతలతో తాను మాట్లాడానని.. సీపీఐఎంల్ను రద్దు చేస్తామని టాప్ లీడర్ దేవ్ జీ తనతో చెప్పారని అన్నారు.
లొంగిపోయిన మావోయిస్టులు తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారన్నారు. దేవ్‌జీ, దామోదర్‌తో సమావేశంలో వచ్చిన ప్రతిపాదనలు కేంద్రానికి పంపించామని.. సెంట్రల్ కమిటీ ప్రతిపాదనలు కేంద్ర హోం మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో పరిష్కారమయ్యే అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
తెలంగాణ ప్రభుత్వం మావోయిస్టులు లొంగిపోయేందుకు సానుకూల వాతావరణం కల్పిస్తుందన్నారు. మావోయిస్ట్ పార్టీ అగ్రనేత గణపతి కూడా లొంగిపోవాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆయన ఆరోగ్యం, ప్రాణాలకు తెలంగాణ ప్రభుత్వం భద్రతా కల్పిస్తుందని హామీ ఇచ్చారు. లొంగిపోయిన మావోయిస్టులకు ఆర్థిక భరోసా, ఆరోగ్యభద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు.
లొంగిపోయిన నక్సలైట్లకు భూమి ఇచ్చే అంశంపై ఇప్పుడే ఏమి చెప్పలేనని అన్నారు. ఇక, జనజీవన స్రవంతిలో కలిసిన మావోయిస్టులు రాజకీయ పార్టీల్లో చేరడం, చేరకపోవడం వాళ్ల ఇష్టమన్నారు. ఒకవేళ ఎవరైనా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వాలనుకుంటే గాంధీ భవన్ లో టీపీసీసీ చీఫ్ మహాష్ కుమార్ గౌడ్ సమక్షంలో పార్టీలో చేరొచ్చని తెలిపారు.
