న్యూఢిల్లీ: ప్రస్తుతం ఉన్న ఎనిమిది కాకుండా దేశంలో మరో కేంద్ర పాలిత ప్రాంత ఏర్పాటుకు మోడీ సర్కార్ ప్రణాళికలు రచిస్తోన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. బీహార్ స్వతంత్ర ఎంపీ రాజేష్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్ చేసిన వ్యాఖ్యలతో ఈ ప్రచారం ఊపందుకుంది. ఈ క్రమంలో కొత్త కేంద్ర పాలిత ప్రాంత ఏర్పాటు వాదనలను సెంట్రల్ గవర్నమెంట్ తోసిపుచ్చింది. కేంద్ర ప్రభుత్వం దగ్గర ప్రస్తుతానికి అలాంటి ప్రణాళికలు ఏమి లేవని స్పష్టం చేసింది.
ఈ మేరకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఈ అంశంపై స్పందించారు. బీహార్, పశ్చిమ బెంగాల్ జిల్లాలను విభజించి కొత్త కేంద్రపాలిత ప్రాంతం (యూటీ)గా మార్చాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందనే వార్తలను ఆయన తోసిపుచ్చారు. ‘‘బీహార్, పశ్చిమ బెంగాల్ నుంచి కొన్ని జిల్లాలను విభజించి కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయాలనే ప్రణాళిక ఉందనేది అవాస్తవం. ఎంపీ పప్పు యాదవ్ వ్యాఖ్యలను ఎవరూ సీరియస్‌గా తీసుకోకూడదు’’ అని నిత్యానంద్ రాయ్ క్లారిటీ ఇచ్చారు.
ఎంపీ పప్పు యాదవ్ ఏమన్నారంటే..?
కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చే ఇండిపెండెంట్ ఎంపీ పప్పు యాదవ్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. బీహార్ సీఎం నితీష్ కుమార్‌ను రాజ్యసభకు పంపడం, లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) సయ్యద్ అతా హస్నైన్‌ను బీహార్ కొత్త గవర్నర్‌గా నియమించడం బీహార్‌లోని సీమాంచల్ ప్రాంతం, పశ్చిమ బెంగాల్‌లోని ముస్లిం ప్రాబల్యం ఉన్న మాల్డా, ముర్షిదాబాద్, ఉత్తర దినాజ్‌పూర్ జిల్లాలను విభజించడం ద్వారా కొత్త కేంద్రపాలిత ప్రాంతంగా మార్చాలనే బీజేపీ వ్యూహంలో ఒక భాగమని ఆరోపించారు. పప్పు యాదవ్ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడంతో కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్ వివరణ ఇచ్చారు.
