భారతదేశంలో 2016 నాటి నోట్ల రద్దు నిర్ణయం తర్వాత... దాదాపు దశాబ్ద కాలంగా కొనసాగిన ఆంక్షకు నేపాల్ తెరదించింది. భారత , నేపాలీ పౌరులు ఇకపై రూ. 200 , రూ. 500 డినామినేషన్ల భారతీయ కరెన్సీ నోట్లను నేపాల్‌లోకి తీసుకురావడానికి, అలాగే తిరిగి దేశం బయటకు తీసుకెళ్లడానికి నేపాల్ ప్రభుత్వం అధికారికంగా అనుమతించింది. గతంలో కేవలం రూ. 100 విలువైన నోట్లను మాత్రమే అనుమతించేవారన్న విషయం తెలిసిందే.
నేపాల్ రాష్ట్ర బ్యాంక్ తాజాగా జారీ చేసిన నోటీసు ప్రకారం... భారతీయ , నేపాలీ జాతీయులు నవంబర్ 9, 2016న లేదా ఆ తర్వాత జారీ చేయబడిన రూ. 200, రూ. 500 నోట్లను, ఒక్కో వ్యక్తికి గరిష్టంగా రూ. 25,000 పరిమితి వరకు తమ వద్ద ఉంచుకోవచ్చని స్పష్టం చేసింది. అయితే 2016 నవంబర్ 9కి ముందు జారీ చేసిన పాత రూ. 500, రూ. 1000 నోట్లు మాత్రం నేపాల్‌లో పూర్తిగా నిషేధంగానే కొనసాగుతాయి.
ఈ సవరించిన నిబంధనలు నేపాల్‌ను సందర్శించే భారతీయ పర్యాటకులకు, భారతదేశంతో వాణిజ్య లావాదేవీలు జరిపే వారికి ఎంతగానో ఉపకరిస్తాయని ఎన్‌ఆర్‌బి ప్రతినిధి గురు ప్రసాద్ పౌడెల్ తెలిపారు. అయితే, నేపాలీ పౌరులు కేవలం భారతదేశం నుండి మాత్రమే ఈ కరెన్సీని నేపాల్‌లోకి తీసుకురావాలని, మూడవ దేశాల నుండి తీసుకురావడానికి లేదా తీసుకెళ్లడానికి వీలేదని స్పష్టం చేశారు. అలాగే, విదేశీ కరెన్సీ విషయంలోనూ రూ. 5,000 డాలర్ల వరకు కస్టమ్స్ డిక్లరేషన్ లేకుండా అనుమతి ఉంటుందని, ఆ మొత్తాన్ని దాటితే మాత్రం తప్పనిసరిగా డిక్లేర్ చేయాలని పేర్కొన్నారు. స్వేచ్ఛా సరిహద్దు, సన్నిహిత సంబంధాలు కలిగిన భారత్-నేపాల్ దేశాల మధ్య ప్రయాణాలను, వాణిజ్య లావాదేవీలను ఈ చారిత్రక నిర్ణయం మరింత సులభతరం చేయనుంది.
