IND vs ZIM: హరారే వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం భారత జట్టులో రెండు మార్పులు చేసింది. గత మ్యాచ్‌లో గాయపడిన పేసర్ ప్రిన్స్ యాదవ్ స్థానంలో అశోక్ శర్మ జట్టులోకి రాగా, ఆల్ రౌండర్ శివమ్ దూబే స్థానంలో సూర్యాంశ్ షెడ్గేకు ఛాన్స్ వచ్చింది. ఈ మ్యాచులో గెలిచి సిరీస్ ని వైట్ వాష్ చేయాలని శ్రేయస్ సేన చూస్తుండగా, చివరి పోరులోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని జింబాబ్వే చూస్తుంది.
భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. నిన్నటి (జులై 25న) మ్యాచ్ జరిగిన పిచ్‌పైనే ఈ ఆఖరి పోరు కూడా జరుగుతుండటంతో, ఆట కొనసాగుతున్న కొద్దీ ఈ పిచ్ స్లో అయ్యే (Slow down) అవకాశం ఉందని పేర్కొన్నాడు. వికెట్ పరిస్థితులకు త్వరగా అలవాటుపడి బోర్డుపై మరోసారి భారీ స్కోరు సాధించడమే తమ లక్ష్యమని శ్రేయస్ వెల్లడించాడు.
జింబాబ్వే కెప్టెన్ రజా మాట్లాడుతూ.. టాస్ గెలిచి ఉంటే మేము కూడా మొదట బ్యాటింగ్ చేసేవాళ్లమని తెలిపాడు. కెప్టెన్‌గా తన నుంచి జట్టుకు మరిన్ని పరుగులు అవసరం, ఈ మ్యాచ్‌లో తమ జట్టు మంచి ప్రదర్శన చేస్తామని ఆశిస్తున్నట్లు పేర్కొన్నాడు. ఇక జింబాబ్వే జట్టులోనూ ఒక మార్పు చేసింది. స్టార్ పేసర్ రిచర్డ్ నగరావా గాయంతో తప్పుకోగా, అతని స్థానంలో వెల్లింగ్టన్ మసకద్జాను తుది జట్టులోకి తీసుకున్నట్లు రజా చెప్పుకొచ్చాడు.
ఇరు జట్లు:
జింబాబ్వే: బ్రియాన్ బెన్నెట్, బెన్ కర్రాన్, డియోన్ మైయర్స్, సికందర్ రజా (కెప్టెన్), ర్యాన్ బర్ల్, వెస్లీ మాధేవెరే, తడివానాషే మారుమణి(వికెట్ కీపర్), బ్రాడ్ ఎవాన్స్, న్యూమాన్ న్యామ్‌హురి, వెల్లింగ్టన్ మసకద్జా, బ్లెస్సింగ్ ముజరబానీ
భారత్: వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్( వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, రింకూ సింగ్, సూర్యాంశ్ షెడ్గే, రవి బిష్ణోయ్, యశ్ ఠాకూర్, మయాంక్ యాదవ్, అశోక్ శర్మ
