13,306 కోట్లకు చేరిన సిప్​ ఇన్వెస్ట్​మెంట్లు

13,306 కోట్లకు చేరిన సిప్​ ఇన్వెస్ట్​మెంట్లు

ఇది ఆల్​టైమ్‌ హై అంటున్న యాంఫీ

న్యూఢిల్లీ: సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్ ప్లాన్‌‌ (సిప్) విధానంలో ఈ ఏడాది నవంబరులో మ్యూచువల్ ఫండ్ (ఎంఎఫ్​) పరిశ్రమలోకి పెట్టుబడులు ఆల్-టైమ్ హై లెవెల్ అయిన రూ. 13,306 కోట్లకు పెరిగాయి. ఎంఎఫ్​లపై పెట్టుబడిదారులకు పెరుగుతున్న ఆసక్తి ఇందుకు నిదర్శనమని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌‌లలో ఇన్‌‌ఫ్లోలు నవంబర్‌‌లో రూ. 9,390 కోట్ల నుండి 76 శాతం తగ్గి రూ. 2,258 కోట్లకు పడిపోయాయని అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (యాంఫీ) శుక్రవారం విడుదల చేసిన డేటా వెల్లడించింది. ఈక్విటీ పథకాలలోకి ఇన్‌‌ఫ్లోలు రావడం ఇది వరుసగా 21వ నెల అని పేర్కొంది. నవంబర్‌‌లో సిప్​ ద్వారా ఇన్​ఫ్లోలు రూ. 13,306 కోట్లుగా ఉన్నాయి. ఇవి అక్టోబర్‌‌లో రూ. 13,041 కోట్ల గరిష్ట స్థాయిని అధిగమించాయి. మే నుంచి సిప్​ల ద్వారా ఇన్‌‌ఫ్లోలు రూ. 12,000 కోట్లకుపైగా ఉన్నాయి. సెప్టెంబర్‌‌లో రూ.12,976 కోట్లు, ఆగస్టులో రూ.12,693 కోట్లు, జులైలో రూ.12,140 కోట్లు, జూన్‌‌లో రూ.12,276 కోట్లు, మేలో రూ.12,286 కోట్ల ఇన్వెస్ట్​మెంట్స్​ వచ్చాయి. ఏప్రిల్‌‌లో నెల  రూ.11,863 కోట్లను ఎంఎఫ్​లలో పెట్టుబడి పెట్టారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఎనిమిది నెలల్లో మొత్తం ఇన్ ఫ్లో రూ.87,275 కోట్లకు చేరింది. 2021-–22 ఆర్థిక సంవత్సరంలో రూ. 1.24 లక్షల కోట్లకు పైగా ఇన్‌‌ఫ్లో ఉంది. 

సిప్​ ఇన్వెస్ట్​మెంట్లు బెస్ట్​..

" ఈక్విటీ మార్కెట్‌‌లో సిప్ ​ఇన్వెస్ట్​మెంట్లు వేగంగా పెరుగుతున్నాయి. ఇవి నవంబర్‌‌లో రూ. 13,307 కోట్ల కొత్త రికార్డును తాకాయి. రిటైల్ ఇన్వెస్టర్లకు సిప్​లు అత్యంత విజయవంతమైన పెట్టుబడి విధానం. ఈ విషయం ఎన్నోసార్లు నిరూపితమైంది కూడా" అని  జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్‌‌మెంట్ స్ట్రాటజిస్ట్ విజయకుమార్ తెలిపారు.  మార్కెట్లు బాగా కరెక్ట్ అయినప్పుడు సిప్​ పెట్టుబడిదారులు తమ పెట్టుబడిని ఆపకూడదని విజయకుమార్ సూచించారు. ఎల్‌‌కెపి సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ ఎస్ రంగనాథన్ మాట్లాడుతూ విదేశీ పెట్టుబడిదారులు లాభాలను బుక్ చేసుకుంటున్నా,  సిప్‌‌ల ఇన్​ఫ్లోలు జీవితకాల గరిష్ట స్థాయుల్లో ఉన్నాయని పేర్కొన్నారు.