మొహాలీ: టెస్టులతో పాటు వైట్‌బాల్ ఫార్మాట్‌లోనూ సత్తా చాటుతున్న టీమిండియా పేసర్, హైదరాబాదీ మహ్మద్ సిరాజ్‌కు బీసీసీఐ ప్రమోషన్ ఇచ్చింది. వార్షిక కాంట్రాక్టుల్లో సిరాజ్‌ను సి నుంచి బి గ్రేడ్‌కు చేర్చింది.
ఫామ్ కోల్పోయిన హార్దిక్ పాండ్యా, పుజారా, రహానెను డిమోట్ చేసింది. ఈ మేరకు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులకు బోర్డు అపెక్స్ కౌన్సిల్ బుధవారం ఆమోదం తెలిపింది. మొత్తంగా ఎ ప్లస్ (ఏడాదికి రూ. 7 కోట్ల ఫీజు), ఎ (5 కోట్లు), బి (3 కోట్లు), సి ( 1 కోటి) అనే నాలుగు కేటగిరీల్లో పోయినేడాది 28 మందిని తీసుకున్న బోర్డు ఈ సారి 27 మందికే సెంట్రల్ కాంట్రాక్టు ఇచ్చింది. ఎ ప్లస్‌లో రోహిత్, కోహ్లీ, బుమ్రాను కొనసాగించింది. ఎ గ్రేడ్‌లో గతంలో పది మంది ఉండగా.. ఈసారి ఐదుగురిని తీసేసింది. అశ్విన్, జడేజా, పంత్, కేఎల్ రాహుల్, షమీని మాత్రమే కొనసాగించింది. పోయినేడాది ‘ఎ’లో ఉన్న హార్దిక్ పాండ్యాను ఏకంగా సి గ్రేడ్‌కు దింపేసింది. ప్రస్తుతం వన్డేలు మాత్రమే ఆడుతున్న ధవన్‌ను కూడా ‘సి’లో చేర్చింది. టెస్టు టీమ్‌లో ప్లేస్ కోల్పోయిన పుజారా, రహానె, ఇషాంత్‌ను ఊహించినట్టే ‘ఎ’ నుంచి గ్రేడ్–బికి డిమోట్ చేసింది. సీనియర్ కీపర్ సాహాను బి నుంచి సి గ్రేడ్‌కు దించింది. సి గ్రేడ్‌లో ఉన్న స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, పేసర్ సైనీని కాంట్రాక్టు లిస్ట్ నుంచి తీసేసింది. సూర్యకుమార్‌కు తొలిసారి కాంట్రాక్టు ఇచ్చి సి గ్రేడ్‌లోకి తీసుకుంది. కాగా, సౌతాఫ్రికాతో జూన్‌లో జరిగే ఐదు టీ20ల సిరీస్‌కు వేదికలుగా కటక్, వైజాగ్, ఢిల్లీ, రాజ్‌కోట్, చెన్నైని బోర్డు అపెక్స్ కౌన్సిల్ ఖరారు చేసింది.

