ఎల్లారెడ్డిపేట, వెలుగు: బ్రతుకుదెరువు కోసం గల్ఫ్‌కు వెళ్లిన ఓ వ్యక్తి గుండెపోటుతో మృతిచెందాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన బత్తుల నర్సయ్య(48) పదేళ్లుగా మస్కట్‌లో పనిచేస్తున్నాడు. ఏడాది క్రితం స్వగ్రామానికి వచ్చి తిరిగి మస్కట్‌కు వెళ్లాడు. అక్కడ బల్దియా కంపెనీలో ఉద్యోగం చేస్తున్న నర్సయ్యకు ఆదివారం అకస్మాత్తుగా గుండె నొప్పి వచ్చింది. సమీపంలో ఉన్న సహచరుడికి విషయం చెప్పగా, అతడు వచ్చేలోపే నర్సయ్య కుప్పకూలిపోయాడు. కంపెనీ ప్రతినిధులు అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. మృతుడి కొడుకు రాకేష్ కూడా ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నాడు. నర్సయ్య మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
