- నేడు బంజారాహిల్స్‌లోని కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఆదేశం
హైదరాబాద్,వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ ముమ్మరంగా కొనసాగుతున్నది. దర్యాప్తులో సేకరించిన ఫోన్ నంబర్ల ఆధారంగా బాధితులు, సాక్షుల స్టేట్‌మెంట్లను సిట్ అధికారులు రికార్డ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డికి సిట్ అధికారులు మంగళవారం నోటీసులు జారీ చేశారు.
బుధవారం ఉదయం 11 గంటలకు బంజారాహిల్స్‌లోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఆయనకు సూచించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో మధుసూదన్ రెడ్డి ఫోన్ నంబర్ ట్యాపింగ్ లిస్టులో ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి, రెండు వాట్సాప్ గ్రూప్‌లకు అడ్మిన్లుగా ఉన్న ఇద్దరు జర్నలిస్టుల స్టేట్‌మెంట్లను సిట్ అధికారులు ఇప్పటికే రికార్డ్ చేసినట్లు తెలిసింది.
