ఎంసెట్ సహా అన్ని పరీక్షలకు నిమిషం రూల్

ఎంసెట్ సహా అన్ని పరీక్షలకు నిమిషం రూల్
  • ఎంసెట్ సహా అన్ని పరీక్షలకు నిమిషం రూల్
  • చేతులపై మెహందీ, టాటూలు ఉండొద్దు
  • హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ లింబాద్రి వెల్లడి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో త్వరలో ప్రారంభం కానున్న అన్ని ప్రవేశ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్టు హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. దీంట్లో భాగంగా చెక్ ఇన్ విధానంలో బయోమెట్రిక్ అటెండెన్స్, ఫెషియల్ క్యాప్చర్ చేస్తున్నట్టు చెప్పారు. సెంటర్లను తనిఖీ చేసే ఫ్లైయింగ్ స్క్వాడ్​లతోపాటు ఈ సారి ప్రతి సెంటర్​లో సిట్టింగ్ అబ్జర్వర్లు కూడా ఉంటారని తెలిపారు. ఎంసెట్ సహా, ఇతర ఎంట్రెన్స్ పరీక్షలు రాసే అభ్యర్థులు చేతులపై మెహందీ, టాటూలు వేసుకొవద్దని సూచించారు. మంగళవారం హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్​లో జేఎన్టీయూ వీసీ కట్టా నర్సింహారెడ్డి, కౌన్సిల్ సెక్రటరీ శ్రీనివాస్​రావు, ఇతర సెట్స్ అధికారులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.

ముందుగా ఈసెట్ పరీక్షను రెండు సెషన్స్ అనుకున్నామనీ, కానీ తక్కువ అప్లికేషన్ల రావడంతో ఒకే సెషన్​లో పరీక్ష నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఎడ్ సెట్, లాసెట్ కూడా మూడు సెషన్లలో ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నామనీ వెల్లడించారు. అభ్యర్థులకు పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. అభ్యర్థులు ఒక రోజు ముందుగానే సెంటర్లను చూసి రావాలని సూచించారు. ఉదయం జరిగే ఎగ్జామ్ సెషన్​కు 7.30గంటల నుంచే సెంటర్​లోకి అనుమతిస్తామనీ, మధ్యాహ్నం రెండో సెషన్​కు 1.30గంటల నుంచి సెంటర్​లోకి అనుమతిస్తామని వివరించారు. సమావేశంలో టీఎస్ ఎంసెట్ కన్వీనర్ దీన్ కుమార్, ఈసెట్ కన్వీనర్ శ్రీరాం వెంకటేశ్​, పీజీఈసెట్ రవీందర్ రెడ్డి, లాసెట్ కన్వీనర్ విజయలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

పెరిగిన ఎంసెట్ సెంటర్లు

గతేడాది 108 కేంద్రాల్లో ఎంసెట్ పరీక్షను నిర్వహించగా, ఈసారి సెంటర్లను 137కు పెంచామనీ లింబాద్రి తెలిపారు. దీంట్లో తెలంగాణలో 104, ఏపీలో 33 పెట్టామని చెప్పారు. గతేడాది టీఎస్ఎంసెట్​కు 2,66,714 మంది అప్లై చేయగా, ఈసారి 3,20,587 మంది రిజిస్టర్ చేసుకున్నారని వివరించారు. గతేడాదితో పోలిస్తే ఈసారి 53,873 అప్లికేషన్లు పెరిగాయన్నారు.