ప్రమాదం కాదు పక్కా ప్లాన్..కేఫ్‌లోనే కాబోయే భర్త హత్యకు స్కెచ్.. మైండ్ బ్లాక్ చేసిన పూణే మర్డర్ మిస్టరీ!

ప్రమాదం కాదు పక్కా ప్లాన్..కేఫ్‌లోనే కాబోయే భర్త హత్యకు స్కెచ్.. మైండ్ బ్లాక్ చేసిన పూణే మర్డర్ మిస్టరీ!

పూణేలో సంచలనం సృష్టించిన కేతన్ అగర్వాల్ మరణం కేసు ఒక పెద్ద మలుపు తిరిగింది. మొదట ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా భావించిన ఈ ఘటన, ఒక పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన ఘోర హత్యగా తేలింది.

జూన్ 17న పూణేలోని ఒక కేఫ్‌లో సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి ఇద్దరూ కలిసి కాఫీ డేట్‌కు వెళ్లారు. అక్కడ కూర్చుని మాట్లాడుకుంటూ.. తరువాత రోజు అంటే జూన్ 18న సియా కాబోయే భర్త, ప్రముఖ వ్యాపారవేత్త అయిన కేతన్ అగర్వాల్‌ను ఎలా చంపాలో పక్కా ప్లాన్ వేశారు. లోహగడ్ కోట గురించి యూట్యూబ్ వీడియోలు చూపిస్తూ.. కేతన్‌ను ఎక్కడ నుండి లోయలోకి నెట్టేయాలో సియా తన ప్రియుడికి వివరించింది. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని పోలీసులు సేకరించారు. ఆ కేఫ్‌లో వారు దాదాపు ఒక గంట సేపు గడిపినట్లు స్పష్టం అయ్యింది.

 ప్రమాదం అనుకున్నారు.. కానీ 
కేతన్ అగర్వాల్ ఒక ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థకు డైరెక్టర్ అండ్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్‌గా పని చేస్తున్నారు. కేతన్, సియా గోయల్‌లకు ఈ ఏడాది మొదట్లోనే నిశ్చితార్థం అయింది. ఈ నవంబరులో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఎంతో అంగరంగ వైభవంగా పెళ్లి చేయడానికి ఇరు కుటుంబాలు  ప్లాన్ చేసుకున్నారు.

ఇంతలోనే, జూన్ 18న లోహగడ్ కోటలో ట్రెక్కింగ్ చేస్తుండగా కేతన్ లోయలో పడి చనిపోయాడు. ఆ సమయంలో సియా పోలీసులకు కథలు చెప్పింది. "కోట అంచున నిలబడి ఇద్దరం ఫోటోలు తీసుకుంటుండగా, బలమైన గాలుల వల్ల కేతన్ కాలు జారి పడిపోయాడు" అని నమ్మించింది. పోలీసులు మొదట దీన్ని ప్రమాదంగానే భావించి కేసు నమోదు చేశారు. మూడు గంటల పాటు కష్టపడి సహాయక బృందాలు కేతన్ శవాన్ని లోయలో నుండి బయటకు తీశారు.

 పోలీసులకు వచ్చిన అనుమానాలు.. 
కేతన్ కుటుంబికులు మొదట్లో ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయలేదు. అనవసరమైన వివాదాలు వద్దని పోలీసులను కోరారు. కానీ, పోలీసులు మాత్రం మొదటి నుంచీ చాలా అలర్ట్‌గా ఉన్నారు. సియా చెప్పిన మాటల్లో పొంతన లేకపోవడమే పోలీసుల అనుమానాలకు కారణమైంది.

మారిన మాటలు: మొదట ఫోటోలు తీసుకుంటూ జారిపడ్డాడని చెప్పిన సియా.. ఆ తర్వాత విచారణలో.. మేము రెస్ట్  తీసుకుంటున్నప్పుడు కేతన్ నీళ్లు అడిగాడు, వాటర్ బాటిల్ ఇస్తుండగా జారిపడ్డాడు అంటూ మాట మార్చింది.

మొబైల్‌లో ఫోటోలు : ఇద్దరూ ఫోటోలు తీసుకుంటున్నామని సియా చెప్పింది, కానీ చనిపోయిన కేతన్ మొబైల్ ఫోన్‌లో లోహగడ్ కోటకు సంబంధించిన ఒక్క ఫోటో కూడా లేదు. పైగా కేతన్ పడిపోయిన ప్రదేశం చాలా నిర్మానుష్యమైనది. సాధారణంగా ట్రెక్కర్స్ అక్కడ అస్సలు ఆగరు.

ALSO READ : 40 మంది సైనికులపై.. పోలీస్ స్టేషన్ లో కేసు

హుడీ ధరించిన మిస్టరీ మ్యాన్: కోట చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా.. ఒక వ్యక్తి  హుడీ ధరించి కేతన్, సియాల వెనుక నడుస్తూ కనిపించాడు. సియా పదే పదే వెనక్కి తిరిగి చూడటం, ఒక చోట అతనికి చేతితో సైగ చేయడం పోలీసులు గమనించారు.

టెక్నాలజీతో నిందితులను పట్టుకున్న పోలీసులు
కాల్ రికార్డులు (CDR), మొబైల్ లొకేషన్ డేటా ఆధారంగా ఆ మిస్టరీ మ్యాన్ సియా ప్రియుడు చేతన్ చౌదరి అని పోలీసులు గుర్తించారు. కేతన్, సియాలు కోటకు రాకముందే చేతన్ అక్కడికి చేరుకున్నాడు. పని పూర్తయ్యాక కేవలం 48 నిమిషాల్లోనే అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సరదాగా తిరగడానికి వచ్చినవాడు అంత త్వరగా వెళ్లడు కాబట్టి, ఇది ముందే ప్లాన్ చేసిన హత్య అని పోలీసులకు గట్టి సాక్ష్యం దొరికింది.

నిందితుల అరెస్ట్
క్రైమ్ బ్రాంచ్ పోలీసులు చేతన్ చౌదరిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం బయటపడింది. డిజిటల్ సాక్ష్యాలు, సీసీటీవీ ఫుటేజ్ ముందు పెట్టేసరికి సియా గోయల్, చేతన్ చౌదరి ఇద్దరూ తప్పును ఒప్పుకున్నారు. కేవలం వారి మాటలనే కాకుండా ఫోరెన్సిక్ ఇంకా సాంకేతిక ఆధారాలన్నింటినీ సేకరించిన తర్వాతే పోలీసులు సియా, చేతన్‌లను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వీరిద్దరూ జైల్లో ఉన్నారు. కేతన్ మరణానికి దారితీసిన మరిన్ని వివరాలను సేకరించేందుకు పోలీసులు ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.