
ఒకటి కాదు. రెండు కాదు. పదులూ కాదు.. వందల సంఖ్యలో మంచు కొండలు సంద్రంలో కొట్టుకుపోతున్నాయి. అలా అని చిన్నవీ కాదవి. ఒక్కొక్కటి 150 అడుగులకు పైనే ఎత్తున్న కొండలవి. కెనడాకు సమీపంలోని కేప్ బొనావిస్టాలో ఉన్న లాబ్రాడార్ సముద్రంలో ఈ మంచు కొండలు కొట్టుకుపోతున్నాయి. కేప్బొనావిస్టాకే చెందిన మార్క్ గ్రే అనే ఫొటోగ్రాఫర్ తన కెమెరాలో ఈ కొట్టుకుపోతున్న మంచు కొండలను క్లిక్‌మనిపించాడు. ఒక మంచుకొండైతే కేప్బొనావిస్టా లైట్‌హౌస్ వరకూ కొట్టుకెళ్లి, ఆ కొండను తాకి ఆగిపోయింది. ఏటా 400 నుంచి 800 మంచు కొండలు న్యూఫౌండ్‌ల్యాండ్ తీరానికి కొట్టుకొస్తున్నాయని గ్రే చెప్పాడు. 1984లో అయితే ఏకంగా 2 వేల మంచు కొండలు తీరానికి కొట్టుకొచ్చినట్టు గుర్తు చేశాడు. ఈ కొట్టుకొస్తున్న మంచుకొండలన్నీ కూడా గ్రీన్ల్యాండ్దేనని అన్నాడు. ఆ ఐస్ వయసు 10 వేల నుంచి 12 వేల సంవత్సరాలని చెబుతున్నాడు. స్థానికులు ఈ ఐస్‌బర్గ్ నుంచి కొన్ని ముక్కలను తీసి జిన్, వోడ్కా వంటి డ్రింక్స్‌లో వాడుతున్నారని అధికారులు చెబుతున్నారు. ఈ ఐస్బర్గ్లతో కరువును చాలా వరకు తగ్గించొచ్చని అధికారులు అంటున్నారు. మంచు కొండలను నీటి వనరులుగా వాడుకోవచ్చని చెబుతున్నారు.