హైదరాబాద్, వెలుగు: ఎప్‌సెట్–2026 ఫలితాల్లో సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు తమ ప్రతిభ చాటారు. గురుకులాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) విద్యార్థులు ఉత్తమ ర్యాంకులను సాధించారు. అగ్రికల్చర్ అండ్ మెడిసిన్ విభాగాల్లో గురుకుల విద్యార్థులు సాధించిన అత్యుత్తమ ఫలితాలపై సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల అంకితభావం , సంస్థ అందిస్తున్న నిరంతర సహకారానికి ప్రతిఫలమని ఆయన పేర్కొన్నారు.
గురుకుల విద్యార్థులకు నిరంతరం ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అండగా నిలవడం వల్లే ప్రతి పరీక్షలో మంచి ర్యాంకులు వస్తున్నాయని తెలిపారు. విద్యా సంవత్సరమంతా విద్యార్థులకు మార్గదర్శకత్వం అందిస్తూ ప్రోత్సహించిన అధికారులను, అధ్యాపకులను మంత్రి అభినందించారు. ఈ ఫలితాలపై గురుకుల సెక్రటరీ కె. శారదా సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఏడాది విడుదలైన ఎస్‌ఎస్‌సీ, ఇంటర్, జేఈఈ ఫలితాల్లో కూడా గురుకుల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారని గుర్తుచేశారు. ప్రత్యేకంగా బోటనీ, జూలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ విభాగాల ఉపాధ్యాయుల కృషి ప్రశంసనీయమని ఆమె తెలిపారు.
