జీడిమెట్ల, వెలుగు: అనారోగ్యం కారణంగా సెలవు పెడితే తనను ఉద్యోగం నుంచి తీసేశారని ఆరోపిస్తూ భావన అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గురువారం బహదూర్ పల్లిలోని టెక్ మహీంద్రా కంపెనీ ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాను ఎంతో కష్టపడి టెక్ మహీంద్రాలో ఉద్యోగం సాధించానని తెలిపారు. గత జూన్ లో ఆఫీస్‌లోనే అనారోగ్యంతో పడిపోగా, సహచర ఉద్యోగులు తనను హాస్పిటల్‌కు తరలించారని చెప్పారు. తాను చికిత్స పొందుతున్న సమయంలోనే ఉద్యోగం నుంచి తీసేస్తామంటూ మానసికంగా కుంగదీసేలా ఈ- మెయిల్స్ పంపారని, ఫోన్ కాల్స్ చేస్తూ వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆ తర్వాత తన కూతురికి ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆఫీస్‌కు వెళ్లలేకపోయానని, దాంతో ఉద్యోగం నుంచి తీసివేశారని ఆరోపించారు. యాజమాన్యం కావాలనే తనపై కక్షసాధింపు చర్యలకు పాల్పడిందన్నారు. కంపెనీలో మహిళలపై జరుగుతున్న వేధింపులపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
