- ఆగ్నేయ అరేబియా సముద్రంలోకి ప్రవేశం
- రాష్ట్రంలో మళ్లీ పెరుగుతున్న ఎండలు
- ఆరు జిల్లాల్లో 5 డిగ్రీలకుపైనే టెంపరేచర్లు
- నిర్మల్ జిల్లాలో 45.8 డిగ్రీలు
హైదరాబాద్, వెలుగు: నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయి. శనివారం అండమాన్ నికోబార్ దీవుల్లోకి ప్రవేశించిన రుతుపవనాలు.. మరింత ముందుకు సాగాయి. అండమాన్‌ను దాటి అరేబియా సముద్రంలోకి ప్రవేశించాయి. ఆగ్నేయ అరేబియా ప్రాంతంలోని కొంతమేరకు రుతుపవనాలు విస్తరించాయని ఐఎండీ వెల్లడించింది. రెండు రోజులుగా అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని, పశ్చిమ గాలుల తీవ్రత కూడా పెరిగిందని తెలిపింది.
రాబోయే మూడు, నాలుగు రోజుల్లో రుతుపవనాలు మరింత విస్తరించే అవకాశాలున్నాయని, అందుకు వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలంగా ఉన్నాయని పేర్కొంది. ఇక రాష్ట్రంలో ఎండలు మళ్లీ తీవ్రమవుతున్నాయి. టెంపరేచర్లు మరోసారి 46 డిగ్రీల మార్క్‌కు చేరువయ్యాయి. శనివారం ఆరు జిల్లాల్లో 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా నిర్మల్ జిల్లా తానూరులో 45.8 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. ఆదిలాబాద్ జిల్లా భోరజ్‌లో 45.5, నిజామాబాద్ జిల్లా భీంగల్‌లో 45.3, జగిత్యాల జిల్లా గోధూరులో 45.2, కామారెడ్డి జిల్లా ఏలుపుగొండ, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్‌లలో 45.1 డిగ్రీల చొప్పున టెంపరేచర్లు నమోదయ్యాయి.
మెదక్ జిల్లా రేగోడ్‌లో 44.3 డిగ్రీల టెంపరేచర్ రికార్డు అయింది. 9 జిల్లాల్లో 43 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఒక్క వరంగల్ జిల్లాలో మాత్రం 40 డిగ్రీలలోపే నమోదైంది. ఆ జిల్లాలోని మంగళవారిపేటలో 39.9 డిగ్రీలుగా టెంపరేచర్ ఉంది. రాబోయే నాలుగైదు రోజుల పాటు 2 నుంచి 3 డిగ్రీల మేర టెంపరేచర్లు పెరిగే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. అన్ని జిల్లాలకూ ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది. అయితే, ఆదివారం మాత్రం పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
