హాంకాంగ్‌లో చీలిపోయిన జనం

హాంకాంగ్‌లో చీలిపోయిన జనం

ప్రభుత్వ వ్యతిరేక, అనుకూల ర్యాలీలు

 భారీగా మోహరించిన పోలీసులు

హాంకాంగ్‌‌: ఆందోళనలతో హాంకాంగ్‌‌ అట్టుడుకుతోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొందరు, అనుకూలంగా మరికొందరు ర్యాలీలు తీశారు. శనివారం ఉదయం టీచర్లంతా ఆందోళన చేస్తున్న స్టూడెంట్లకు మద్దతుగా నిలిచారు. ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌లో ఈ మధ్య జరిగిన ఆందోళనకు వ్యతిరేకంగా.. ప్రభుత్వ మద్దతుదారులు చైనా ఫ్లాగులు పట్టుకుని ర్యాలీ చేశారు.

టీచర్ల ర్యాలీ

హాంకాంగ్‌‌ స్కూల్‌‌ టీచర్లు ఆందోళన బాట పట్టారు. శనివారం ఉదయం వీకెండ్‌‌ ర్యాలీ తీశారు. “ప్రొటెక్ట్‌‌ ద నెక్స్ట్‌‌ జనరేషన్‌‌” అని ప్లకార్డులు ప్రదర్శిస్తూ హాంకాంగ్‌‌ చీఫ్‌‌ క్యారీ లామ్‌‌ ఇంటికి ర్యాలీగా వెళ్లారు.   స్టూడెంట్స్‌‌కు  సపోర్ట్‌‌ చేసేందుకు ఆందోళన చేస్తున్నామని టీచర్లు చెప్పారు. ఆందోళనకారుల డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని, పోలీసులు హింసను ఆపాలని భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా నిరసన చేపట్టారు. “ పోలీసులు, ప్రభుత్వం చేస్తున్న హింసకు వ్యతిరేకంగా పోరాడేందుకు వచ్చాం. స్టూడెంట్స్‌‌కు సపోర్ట్‌‌ చేసే రైట్‌‌ మాకు ఉంది” అని సెకండరీ స్కూల్‌‌ టీచర్‌‌‌‌ ఒకరు చెప్పారు. ప్రో – బీజింగ్‌‌ ఫెడరేషన్‌‌ ఆఫ్‌‌ ట్రేడ్‌‌ యూనియన్స్‌‌ ఆఫీసులపై కొంత మంది నిరసనకారులు దాడులు చేశారు. గుడ్లు, రాళ్లను విసిరి, గ్రాఫిటీలు వేశారు. “ ఇప్పుడు మనం బయటకు రాకపోతే.. ఆందోళన చేయకపోతే భవిష్యత్తు తరాలకు మోసం చేసిన వాళ్లం అవుతాం” అని ఆందోళనకారులు చెప్పారు. నేరస్తుల అప్పగింత బిల్లుకు వ్యతిరేకంగా హాంకాంగ్‌‌ ప్రజలు దాదాపు 10 వారాల నుంచి ఆందోళన చేస్తున్నారు.    ఇప్పటి వరకు దాదాపు 700 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

మద్దతు దారుల ప్రదర్శన

ప్రభుత్వానికి మద్దతుగా స్థానిక పార్క్‌‌లో వందలాది మంది ర్యాలీ నిర్వహించారు. చైనా జెండాలను పట్టుకుని  పోలీసులకు మద్దతు ఇవ్వాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా హార్బర్‌‌‌‌ దగ్గర్లో ఏర్పాటు చేసిన పెద్ద స్క్రీన్‌‌ మీద ఈ మధ్య ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌లో జరిగిన ఆందోళనలు ప్రదర్శించారు. “ వాళ్లవి రాక్షస చర్యలు. ఒక ఆలోచన, రీజన్‌‌ లేకుండా ఆందోళన చేస్తున్నారు” అని 60 ఏళ్ల ప్రో బీజింగ్‌‌ కార్యకర్త అభిప్రాయపడ్డారు. “ అహింస” పేరుతో ఆదివారం భారీ ర్యాలీ చేస్తున్నట్లు ప్రకటించారు.