అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలి : మంత్రి శ్రీధర్ బాబు

అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలి : మంత్రి శ్రీధర్ బాబు
  •     మంత్రి శ్రీధర్ బాబు ఆదేశం
  •     మేడ్చల్ కలెక్టరేట్​లో జిల్లా స్థాయి సమీక్ష

మేడ్చల్ కలెక్టరేట్, వెలుగు: అర్హులైన లబ్ధిదారులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని మేడ్చల్ జిల్లా ఇన్​చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశించారు. కలెక్టరేట్​లో కలెక్టర్ మను చౌదరి, స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి సోమవారం ఆయన జిల్లా స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజా పాలనలో వచ్చిన అర్జీలను త్వరగా పరిష్కరించాలని, నిబంధనల ప్రకారం అర్హులందరికీ రేషన్ కార్డులు మంజూరు చేయాలని సూచించారు. ఎండాకాలంలో తాగునీటి ఎద్దడి రాకుండా చూడాలని, జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పీహెచ్‌సీలు ఏర్పాటు చేయాలన్నారు. 

అంగన్వాడీల్లో పౌష్టికాహారం, హాస్టళ్లలో మెనూ ప్రకారం భోజనం అందించడంలో రాజీ పడకూడదని స్పష్టం చేశారు. నేషనల్ హైవే విస్తరణ పనులు వేగవంతం చేయాలని, వర్షాకాలం దృష్ట్యా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లీకేజీలు, మరమ్మతులను వెంటనే పూర్తి చేయాలని హౌసింగ్ అధికారులను ఆదేశించారు. జవహర్ నగర్​లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.