మోడీతో అమీర్, షారూఖ్ సెల్ఫీలు

మోడీతో అమీర్, షారూఖ్ సెల్ఫీలు

దేశంలోని సినీ ప్రముఖులతో ప్రధాని మోడీ సమావేశమయ్యారు. ఢిల్లీలోని లోక్ కల్యాణ్ మార్గ్ లో జరిగిన సమావేశంలో భారత జాతిపిత మహాత్మగాంధీ 150 వ జయంతి ఉత్సవాలపై వారితో మోడీ చర్చించారు. షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, కంగనా రనౌత్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, ఇంతియాజ్ అలీ, ఏక్తా కపూర్, అనురాగ్ బసు, బోనీ కపూర్ తో పాటు పలువురు ప్రముఖ తారలు, చిత్ర నిర్మాతలు మోడీతో తమ అభిప్రాయాలు పంచుకున్నారు.

మహాత్మగాంధీ సేవలను కీర్తించారు ప్రధాని మోడీ. గాంధీజీ ఆలోచనలు, సిద్ధాంతాలు ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచాయని చెప్పారు. గాంధీ సృజనాత్మకత శక్తి అద్భుతమన్న ప్రధాని.. ఆ స్పూర్తిని దేశ అభివృద్ధికి ఉపయోగించుకోవడం అవసరమన్నారు. మహాత్మగాంధీ సిద్ధాంతాలను విస్తృతం చేయడంలో సినీ, టీవీ పరిశ్రమకు చెందిన కొందరు సభ్యులు గొప్పగా పని చేస్తున్నారని చెప్పారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై మద్దతు తెలిపినందుకు అమీర్ ఖాన్ కు ప్రధాని ధన్యవాదాలు తెలిపారు.

సినీతారలను ఏకతాటిపై తెచ్చినందుకు ప్రధానికి కృతజ్ఞతలు చెప్పారు షారూఖ్ ఖాన్. గాంధీజీని భారతదేశానికి మరియు ప్రపంచానికి తిరిగి పరిచయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. గాంధీజి సిద్ధాంతాలను ప్రజలకు తెలియజేసేలా ప్రధాని మోడీ చేస్తున్న కృషిని అమీర్ ఖాన్ అభినందించారు. ఇందుకోసం తాము కూడా చేయాల్సి దాని కన్నా ఎక్కువగానే కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

సినీ పరిశ్రమ సమస్యలు, జీఎస్టీ రాయితీ, ఫిల్మ్ ఇండస్ట్రీకి సర్కార్ ప్రోత్సహకాలపైనా ప్రధాని చర్చించారు. సమావేశం తర్వాత మోడీతో కొందరు తారలు సెల్ఫీలు దిగారు. అందరితో కలిసి గ్రూప్ ఫోటో దిగారు ప్రధాని.