- 56 సెక్టార్లలో సేవలు అందిస్తున్నయ్
న్యూఢిల్లీ: భారతదేశంలో గుర్తింపు పొందిన స్టార్టప్‌ల సంఖ్య శరవేగంగా పెరుగుతోంది. 2016లో వీటి సంఖ్య కేవలం 471 కాగా, 2022 నాటికి 72,993కి పెరిగింది. అంటే ఏకంగా 15,400 శాతం పెరిగాయి. ఇవి 56 విభిన్న రంగాలలో విస్తరించి ఉన్నాయి. గవర్నమెంట్డేటా ప్రకారం, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ), రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అనలిటిక్స్ వంటి రంగాలలో 4,500 కంటే ఎక్కువ గుర్తింపు పొందిన స్టార్టప్‌లు ఉన్నాయి.
“స్టార్టప్‌లు ఈ దేశ టెక్నాలజీ ఎకోసిస్టమ్‌కు గ్రోత్ఇంజన్లు. ఈ విషయాన్ని గుర్తించి మన ఆర్థిక వృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లి పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను కల్పించే భారత స్టార్టప్ సంస్కృతిని పెంపొందించాలి. ఇందుకు బలమైన ఎకోసిస్టమ్‌ను నిర్మించాలనే లక్ష్యంతో ప్రభుత్వం 2016 జనవరి 16న స్టార్టప్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించింది” అని కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ (ఏఐఎఫ్‌లు) ఇంక్యుబేటర్ల ద్వారా స్టార్టప్‌లకు ఆర్థిక సహాయం కోసం ప్రభుత్వం ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఫర్ స్టార్టప్ (ఎఫ్‌ఎఫ్‌ఎస్) స్కీమ్, స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ (ఎస్‌ఐఎస్‌ఎఫ్‌ఎస్)లను అమలు చేస్తోందని కేంద్ర పరిశ్రమల సహాయ శాఖ మంత్రి సోమ్ ప్రకాశ్ చెప్పారు.
భారీగా నిధులు
స్టార్టప్‌ల నిధుల అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం రూ.10 వేల కోట్ల కార్పస్‌తో ఎఫ్ఎఫ్ఎస్ని ఏర్పాటు చేసింది. దీనికి డీపీఐఐటీ మానిటరింగ్ఏజెన్సీగా, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సిడ్బీ) ఆపరేటింగ్ ఏజెన్సీగా పనిచేస్తున్నాయి. స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ (ఎస్‌ఐఎస్‌ఎఫ్‌ఎస్) స్టార్టప్‌లకు ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్, ప్రోటోటైప్ డెవలప్‌మెంట్, ప్రొడక్ట్ ట్రయల్స్, మార్కెట్ ఎంట్రీ కమర్షియల్‌లైజేషన్ కోసం ఆర్థిక సహాయం వంటివి అందిస్తోంది. ఎస్‌ఐఎస్‌ఎఫ్‌ఎస్ పథకం కింద గత నాలుగు సంవత్సరాల్లో రూ.945 కోట్లు మంజూరు చేశారు.
ప్రారంభ దశలో ఉన్న స్టార్టప్‌లకు మూలధనం సులభంగా అందడం చాలా అవసరం. డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డీఎస్టీ) 2016లో ఆలోచనలను, ఆవిష్కరణలను (నాలెడ్జ్ ఆధారిత సాంకేతికతతో నడిచే) పెంపొందించడం కోసం 'నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ డెవలపింగ్ అండ్ హార్నెసింగ్ ఇన్నోవేషన్స్' (నిధి) పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించింది.
ఎంటర్‌ప్రెన్యూర్స్-ఇన్-రెసిడెన్స్ (ఈఐఆర్) ప్రోగ్రాం ద్వారా ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ను ఎంచుకునే విద్యార్థులకు ఫెలోషిప్‌లను అందించడం, యువ ఔత్సాహిక ఆవిష్కర్తలను ప్రోత్సహించడం వంటివి చేస్తున్నది. బయోటెక్నాలజీ రంగంలో ఇనోవేషన్లను ప్రోత్సహించడానికి, బయోటెక్నాలజీ పరిశ్రమ పరిశోధన సహాయ మండలి (బిరాక్) ద్వారా బయోటెక్నాలజీ విభాగం, బయోటెక్నాలజీ రంగంలో స్టార్టప్‌లకు సాయం చేస్తోంది. బయోనెస్ట్ స్కీమ్ (బయో-ఇంక్యుబేటర్స్ నర్చరింగ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఫర్ స్కేలింగ్ టెక్నాలజీస్), బయోటెక్నాలజీ ఇగ్నిషన్ గ్రాంట్ (బిగ్) స్కీమ్‌లు... ఇది అమలు చేసే ప్రధాన పథకాలు.
