- ప్రభుత్వ ఉద్యోగాలకు మరోసారి పదేండ్లు సడలింపు
- 34 ఏండ్ల నుంచి 44 ఏండ్లకు పెంచుతూ రాష్ట్ర సర్కారు ఉత్తర్వులు
- వచ్చే ఏడాది వరకు అన్ని నోటిఫికేషన్లకు వర్తింపు
హైదరాబాద్, వెలుగు:రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రభుత్వ ఉద్యోగాల ప్రత్యక్ష నియామకాల్లో గరిష్ట వయోపరిమితిని మరోసారి పదేండ్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. గత కొంతకాలంగా రాష్ట్రంలోని నిరుద్యోగుల నుంచి వస్తున్న వినతులను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం.. అభ్యర్థులకు ప్రయోజనం చేకూర్చేలా ఈ వెసులుబాటు కల్పించింది. తాజా నిర్ణయంతో సాధారణ అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి ప్రస్తుతం ఉన్న 34 ఏండ్ల నుంచి 44 ఏండ్లకు పెరిగింది. ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం.. ఈ వయోపరిమితి పెంపు నిర్ణయం ఏడాది పాటు (మే 18, 2026 నుంచి) అమల్లో ఉంటుంది. అంటే రాబోయే ఒక సంవత్సర కాలంలో వెలువడే అన్ని ప్రత్యక్ష నియామక నోటిఫికేషన్లకు ఈ నిబంధన వర్తిస్తుంది.
గతంలో ఉన్న పదేండ్ల సడలింపు గడువు ముగియడంతో, నిరుద్యోగులకు నష్టం కలగకుండా ప్రభుత్వం ఈ అడ్-హక్ రూల్‌ను మళ్లీ పొడిగించింది. దీంతో వయసు పైబడటం వల్ల పోటీ పరీక్షలకు అనర్హులవుతామని ఆందోళన చెందుతున్న లక్షలాది మంది యువతకు గొప్ప అవకాశం లభించినట్లయింది. అయితే, ఈ వయోపరిమితి పెంపు నిర్ణయం అన్ని విభాగాలకు వర్తించదు. ముఖ్యంగా శారీరక ప్రమాణాలు అవసరమైన యూనిఫాం సర్వీసులకు (పోలీస్, ఎక్సైజ్, ఫైర్, జైళ్లు, అటవీ శాఖలు) ఈ మినహాయింపు వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
కేవలం సాధారణ సర్వీసులకు మాత్రమే ఈ 44 ఏండ్ల గరిష్ట పరిమితి వర్తిస్తుంది. ఈ నిబంధన తక్షణమే అమల్లోకి వస్తుందని, అన్ని నియామక సంస్థలు దీనిని పాటించాలని సీఎస్ రామకృష్ణారావు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
నోటిఫికేషన్లపై నిరుద్యోగుల్లో ఆశలు
వాస్తవానికి రాష్ట్ర ఏర్పాటు తర్వాత నిరుద్యోగుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం గరిష్ట వయోపరిమితిని పెంచడం ఇది వరుసగా నాలుగోసారి. తొలుత 2015లో (జీవో 329) వయోపరిమితిని 34 ఏండ్ల నుంచి 44 ఏండ్లకు పెంచగా, ఆ తర్వాత 2022లో (జీవో 42), మళ్లీ 2024లో (జీవో 30) ఇదే వెసులుబాటును పొడిగిస్తూ వచ్చారు. తాజా ఉత్తర్వులతో కలిపి ఈ పదేండ్ల సడలింపు ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతోంది.
ఈ నిర్ణయం వెలువడటంతో ఇక రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న గ్రూప్స్ సహా వివిధ శాఖల్లోని ఉద్యోగ నోటిఫికేషన్లు వరుసగా విడుదలవుతాయనే ఆశాభావం నిరుద్యోగ వర్గాల్లో వ్యక్తమవుతోంది. వయోపరిమితి అడ్డంకి తొలగిపోవడంతో, నియామక సంస్థలు ఇక నోటిఫికేషన్ల జారీపై దృష్టి సారించి, లక్షలాది మంది నిరీక్షణకు తెరదించుతాయని అభ్యర్థులు ఆశిస్తున్నారు.
